ఖైరతాబాద్, డిసెంబర్ 3 : ఏకాగ్రా చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ వైస్ చైర్మన్, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహ్మద్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్లను నిర్వాహక డైరెక్టర్ గిరీష్ రెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శి సౌమ్యా జానుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022లో తొలిసారిగా ఈ టోర్నమెంట్స్ నిర్వహించామని, 1,300లకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ ఏడాది 2వేలకు పైగా పాల్గొంటారని ఆశిస్తున్నామని, ప్రధానంగా రాయ్ చౌదరి సప్తర్షి (భారత్), ట్విల్ కోపు సెరీజ్ (నెథర్లాండ్స్), సాప్చెంకో బోరిస్ (రష్యా), పెట్రోస్ మారియన్ (బల్గేరియా) వంటి గ్రాండ్ మాస్టర్లు సైతం పోటీ పడుతున్నట్లు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు విభాగాల ఆధారంగా మొత్తం రూ.22,22,222 విలువైన బహుమతులను అందజేస్తామన్నారు. ఇతర వివరాలకు www.ekagrachessacademy.com వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.