హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేదిక అయింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి వేర్వేరుగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టాయి. తన విజయానికి సహకరించిన వారి పేర్లు చెప్పిన ఈటల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరును మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. పార్టీ ముఖ్యుల సూచనలమేరకు పనిచేశారు అని నర్మగర్భంగా చెప్పారే తప్ప.. తన విజయానికి శ్రమించారు, సహకరించారు అని నేరుగా చెప్పకపోవడం గమనార్హం. అలాగే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా దీనిని ప్రజల గెలుపుగా మాత్రమే అభివర్ణించారు. కమలం పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం వరకు ఈటల తాను బీజేపీ అభ్యర్థిని అని చెప్పుకోవడం కన్నా.. వ్యక్తిగతంగానే ప్రచారం చేసుకున్నారు. మొదటి నుంచి ఈటల బీజేపీని కానీ, బీజేపీ ఈటలను కానీ తన పార్టీ అని, తమ అభ్యర్థి అని గట్టిగా చెప్పుకోలేకపోయారు. ఈటల తన వ్యక్తిగత రాజకీయ ఉనికి కోసం, కేసుల నుంచి తప్పించుకోవడానికే తమ పంచన చేరినట్టు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. ఈ కారణంగానే హుజూరాబాద్ ఎన్నికల్లో మొక్కుబడి ప్రచారానికే బీజేపీ పరిమితమైంది. ఈటల గెలిచినా, ఓడినా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమన్న అభిప్రాయమే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో బలంగా నాటుకుంది. ఈటల గెలిస్తే పార్టీ విజయంగా, ఓడితే ఆయన వ్యక్తిగత ఓటమిగానే పరిగణించాలని బీజేపీ ముందుగానే నిర్ణయించినట్టు సమాచారం. ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఆయన గెలిస్తే పార్టీలో తన ప్రాబల్యం ఎక్కడ తగ్గుతుందోనన్న అభద్రతా భావం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేష్టల్లో వ్యక్తమైంది. బీజేపీకి ఈటల ఎంతదూరమో, ఈటలకు బీజేపీ కూడా అంతే దూరమన్న రీతిలో ఇరు పక్షాలు వ్యవహరించాయి. ఈటల ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపించమని మాట వరుసకు కూడా కోరకుండా, తనను టీఆర్ఎస్ అన్యాయంగా బయటికి పంపించిందని సానుభూతి పొందడానికే ప్రయత్నించారు. ఈటల రాజేందర్ వ్యవహార శైలితో ఆయన వల్ల పార్టీకి ఏదో మేలు జరుగుతుందన్న భ్రమలు బీజేపీ నాయకత్వానికి కలుగకపోగా, ఈటల తన టైమ్ బాగా లేక బీజేపీని ఆశ్రయించక తప్పలేదన్నట్టుగానే వ్యవహరించారు.