న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు. లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ హాజరయ్యారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం సంప్రదాయం. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ఆగస్ట్ 13 వరకు కొనసాగనుండగా.. 19 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తొలిసారిగా పార్లమెంట్ సమావేశమవుతోంది. ఈ సారి సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదల, కరోనా మహమ్మారి, వ్యాక్సిన్ల కొరత, విదేశాంగ విధానం, రాఫెల్ ఒప్పందం తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. సభ్యులందరూ టీకాలు తీసుకోవాలని కోరారు. కాగా, లోక్సభ సచివాలయం ప్రకారం.. 231 మంది సభ్యులున్న రాజ్యసభలో 200 మంది ఎంపీలు రెండు మోతాదుల టీకా పొందారు. 16 మంది మొదటి మోతాదు వేసుకోగా.. లోక్సభలో 540 మంది ఎంపీల్లో 470 మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు.
Delhi: PM Narendra Modi chairs an all-party meeting at Parliament, a day before the commencement of the Monsoon session pic.twitter.com/ollREeFGpf
— ANI (@ANI) July 18, 2021