కుభీర్, ఫిబ్రవరి 19: కుభీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో గత ఐదు రోజులుగా కొనసాగిన జాతర వేడుకలు కుస్తీ పోటీలు, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్ రాష్ట్ర కుస్తీ పోటీలు ఆహుతులను అలరించాయి. కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమైన ఈ పోటీలు చివరగా రూ.10 వేల కుస్తీతో ముగిశాయి. ఈ సదర్భంగా మల్లయోధులను ఆహుతులు చప్పట్లతోపాటు కేరింతలు, ఈలలు వేస్తూ వారిలో రెట్టింపు ఉత్సాహాన్ని కల్పించారు.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలు రాత్రి 7 గంటలకు ముగిశాయి. ఈ పోటీల్లో మహారాష్ట్రలోని హిమాయత్ నగర్ నాందేడ్ కన్వర్ట్ తదితర ప్రాంతాల మల్లయోధులు తలపడ్డారు. కుస్తీ పోటీల్లో విజేతలైన మల్లయోధులను భుజాన ఎత్తుకొని ప్రాంగణమంతా కలియ తిరిగారు. కుబీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వీ మోహన్, స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, నిర్మల్ జిల్లా లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.