హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : సమగ్ర బాలవికాస కేంద్రాలు(ఐసీడీఎస్)లు అక్రమాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతి దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీ చేయాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా ఫిక్స్డ్ రేట్లు నిర్ణయించి అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. చివరికి సెలవు కావాలన్నా ఎంతోకొంత ముట్టజెప్పాల్సివస్తుందని అంగన్వాడీ యూనియన్ల నాయకులు వాపోతున్నారు. ఇటీవల కరీంనగ ర్, రామగుండం, ముథోల్, భైంసా ప్రాజెక్టుల పరిధిలో వెలుగులోకి వచ్చిన వ్యవహారాలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నారు. పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలయ్యే పోషకాహార, ఆరోగ్య పథకాలను పర్యవేక్షించాల్సిన ఐసీడీఎస్ అధికారులు అక్రమదందాల్లో లీనమైతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. విధులను గాలికొదిలి దండుకోవడంపై దృష్టిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూరగాయలు, కోడిగుడ్లు ఇతరత్రా సరఫరా చేసే చిరు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లోనూ కమీషన్లు పుచ్చుకుంటున్నారని తెలుస్తున్నది. ఇదేంటని ప్రశ్నిస్తే, వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సెలవులు ఇవ్వకుండా, గైర్హాజరు పేరిట కోతలు విధిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు.
ఐసీడీఎస్‌లోని అధికారులు లంచాలు తీసుకొనేందుకు కొత్త పంథా అనుసరిస్తున్నారని తెలుస్తున్నది. నేరుగా నగదు తీసుకొంటే దొరికిపోతామని జాగ్రత్తపడుతున్నారని సమాచారం. వారి సమీప బంధువులు, అనుచరులకు సంబంధించిన అకౌంట్లలో నగదు ఫోన్‌పే, గూగుల్‌పే, ఇతరత్రా ఆన్లైన్ విధానంలో జమచేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల కండ్లుగప్పేందుకే ఇలాం టి ఎత్తుగడలకు దిగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సిబ్బంది, కిందిస్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్, రామగుండం, నిర్మల్, కడెం, బోథ్ పరిధిలో జరిగిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతస్థాయి ఆఫీసర్లు కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. పరస్పర అవగాహనతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు తప్పించుకొనేలా సహకరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేసినా నామమాత్రపు తనిఖీలతో వదిలిపెడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.