హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ తెలిపారు. ఇటీవల మరణించిన 44 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా క్లెయిమ్ సొమ్ము మంజూరుపత్రాలను బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. పార్టీ కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల సాయం అందించే విధంగా పార్టీ బీమా ప్రీమియం చెల్లించిందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా దరకాస్తులను ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపి, వాటి ఆమోదం రాగానే బీమా మంజూరుపత్రాన్ని అందిస్తారని, ఆ తర్వాత రెండు లక్షల చెక్కును మృతిచెందిన పార్టీ కార్యకర్త ఇంటికెళ్లి పార్టీ ముఖ్య నేతలు అందిస్తారని తెలిపారు. చనిపోయిన ఎందరో కార్యకర్తల కుటుంబాలకు ఈ బీమా సొమ్ముతో మేలు జరిగిందని తెలిపారు.