మోత్కూరు, జూలై 10: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప రైతు లు హెచ్చరించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎడ్లబండ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బిక్కేరు వాగు నుంచి ఇసుక తరలించవద్దని 2022లో హైకోర్టు ఉత్తర్వులను జారీచేసిందని గుర్తుచేశారు. వాటిని ఉల్లంఘించి తహసీల్దార్ జ్యోతి ఇసుక తరలింపునకు అనుమతులిచ్చారని ఆరోపించారు. ఆ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలించొద్దని, ఎడ్లబండ్ల ద్వారానే తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు జంగ శ్రీను, విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్ల నరేశ్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు.