Helmet statue | రామగిరి, ఫిబ్రవరి 19: అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘నన్ను ధరించు’ అనే సందేశంతో హెల్మెట్ ధరించిన కార్మికుడి ఆకారంలో రూపొందించిన ఈ విగ్రహం ప్రతీ ఒక్కరికీ భద్రతపై ఆలోచన కలిగించేలా ఆకట్టుకుంటోంది.
ప్రాజెక్ట్ పరిధిలో పనిచేసే కార్మికులు, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు అధికారులు తెలిపారు. పరిశ్రమల ప్రాంతాల్లో ముఖ్యంగా గనుల ప్రాంతాల్లో భద్రతా నిబంధనలు పాటించడం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. విగ్రహం కింద మీ భద్రతను మీరు కాపాడుకోండి అనే సందేశాన్ని కూడా ఉంచి కార్మికుల్లో బాధ్యతాభావాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా హెల్మెట్ వినియోగం పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, కార్మికులు ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తే భద్రతపై అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.