తుర్కయాంజాల్, ఆగస్టు 1 : ఆదిబట్ల సర్కిల్ పరిధి తొర్రూర్ డివిజన్ ఇంజాపూర్ ఆపిల్ ఎవెన్యూ కాలనీ చినుకు పడితే వణికిపోతున్నది. కాలనీ మధ్య నుంచి వెళ్లిన మాసబ్ చెరువు అలుగు కాల్వ కుంచించుకుపోవడంతో ఓ మోస్తరు వర్షానికే వరదనీరు కాల్వ నుంచి బయటకు వచ్చి కాలనీ రోడ్లన్నీ జలమయమవుతుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రియల్ వ్యాపారులు అపిల్ అవెన్యూ కాలనీ ఏర్పాటు సమయంలో కాలనీ మధ్య నుంచి ఉన్న 30 ఫీట్ల మాసబ్ చెరువు అలుగు కాల్వను రియల్ వ్యాపారులు కుదించారు. కేవలం ఒక మీటర్ వెడల్పు నీరు పారడానికి వీలుగా ఏర్పాటు చేశారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా కాల్వ నుంచి వరదనీరు బయటకు వచ్చి కాలనీ రోడ్లపై పారుతున్నది. గతంలో కాల్వను ఒక మీటర్‌కు కుదించి నిర్మించిన కాల్వపై వేసిన సీసీ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఎప్పుడు సీసీ రోడ్డు పూర్తిగా పగిలిపోయి కాల్వ నుంచి నీరు పెద్దఎత్తున కాలనీలోని ఇళ్లకు చేరుతుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
మాసబ్ చెరువు నుంచి ఇంజాపూర్‌లోని దిలావర్ఖాన్ చెరువుకు నీరు వెళ్లే అలుగుకాల్వను కబ్జా చేసి రియల్ వ్యాపారులు అపిల్ అవెన్యూ కాలనీని ఏర్పాటు చేశారు. వెంచర్ ఏర్పాటు సమయంలో సహజసిద్ధంగా ఏర్పడిన కాల్వను కబ్జా చేసి 30 ఫీట్లకు పైగా ఉండాల్సిన 94 మీటర్ల కాల్వను కేవలం ఒక్క మీటరు వెడల్పుతో నిర్మించారు. దీంతో ప్రతి యేటా కాలనీ వరదనీటిలో మునిగిపోతున్నదని కాలనీవాసులు వాపోతున్నారు. అంతేగాక మాసబ్ చెరువు అలుగు కాల్వ, తూము కాల్వను కబ్జా చేస్తూ కాల్వలపై ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టడం కూడా కాలనీలు వరద ముంపునకు గురికావడానికి కారణాలు అవుతున్నాయి. 2020లో వరద బీభత్సం సృష్టించడంతో కాలనీవాసులు బెంబేలెత్తిపోయారు. భవిష్యత్తులో 2020 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకొని.. కుదించిన కాల్వ వెడల్పును పెంచి కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మాసబ్ చెరువు అలుగు కాల్వను ఇటీవలే ఇరిగేషన్ శాఖ పెద్ద అంబర్‌పేట సబ్ డివిజన్ డీఈ ఆంజనేయులు, ఏఈ శ్రీవాణి పరిశీలించారు. అధికారులు పరిశీలించిన సమయంలో అలుగు కాల్వ అపిల్ అవెన్యూ కాలనీలో కుంచించుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. మాసబ్ చెరువు అలుగు కాల్వపై పూర్తి నివేదికను రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులన్నారు.