కొండమల్లేపల్లి, ఆగస్టు 1 : మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఉంది. పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫాం, షూ, నోటు బుక్స్, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన సర్కార్ నేటికీ విద్యార్థులకు యూనిఫామ్ అందించలేదు. పాఠశాలలు ప్రారంభమై నెలన్నర కావొస్తున్నా విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందచేయడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో మొత్తం 216 ప్రభుత్వ పాఠశాలల్లో 12,740మంది విద్యార్ధులు ఉన్నారు. ఒక్కో విద్యార్ధికి రెండు జతల చొప్పున 25,480 యూనిఫారాలు అందించాల్సి ఉంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం రంగు, డిజైన్ మార్పులు చేశారు. హాస్టల్ విద్యార్థులకు యూనిఫామ్ అందకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్న ఒకటీ రెండు దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు యూనిఫారం కొనుగోలు చేయక తప్పడంలేదు. బీఆర్ఎస్ హయాంలో పాఠశాలల పునఃప్రారంభమైన రోజు నుంచే యూనిఫారాలు అందేజేసేవారని అంటున్నారు.
ప్రతి విద్యాసంవత్సరం ఒకే విధమైన యూనిఫాం ఉండటంతో విద్యార్థులకు తగిన వస్ర్తాన్ని వెంటనే పంపించే వారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు వివిధ రంగులతో కూడిన యూనిఫాం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నూతన వస్త్రం వచ్చేందుకు సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు యూనిఫారాలకు సంబంధించిన బట్ట రాకపోవడం గమనార్హం. క్లాత్ వచ్చాక పాఠశాలల వారీగా కొలతలు తీసుకుని ఆపై ఐకేపీ మహిళ సంఘాలకు అప్పగిస్తే వారు కుట్టడం ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియకు నెలల సమయం పడుతుంది. పంద్రాగస్టుకు యూనిఫారాలు అందే అవకాశం లేదని, సివిల్ డ్రస్సుల్లోనే స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందేమోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతుంటారు. గతేడాది పంపిణీ చేసిన యూనిఫారాలు చాలా వరకు చినిగిపోయాయి. ఎక్కువ శాతం మంది చినిగిన యూనిఫారాలను కుట్టుకొని పాఠశాలలకు వస్తున్నారు. యూనిఫారాల విషయంలో విద్యాశాఖ అలసత్వంపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు రెండు జతల యూనిఫారం అందజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం ఒక్క జత కూడా అందించలేదు.
పాఠశాలలు ప్రారంభించి 45 రోజులు దాటింది. పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఇంత వరకు యూనిఫామ్ ఇవ్వలేదు. పాత యూనిఫామ్ చినిగిపోయింది. కొత్తది అందించకపోవడంతో సివిల్ డ్రెస్సుల్లోనే బడికి వెళ్తున్నారు. కొత్తది అందకపోవడంతో అందరూ సివిల్ డ్రెస్సుల్లోనే పాఠశాలకు వస్తున్నారు. ఇప్పటికైనా యూనిఫారాలు అందజేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాల ప్రారంభించి 40 రోజులు దాటింది. పాఠ్యపుస్తకాలు అందజేశారు. కానీ ఇంత వరకు యూనిఫారం ఇవ్వలేదు. నా పాత యూనిఫారం చినిగిపోయింది. కొత్త యూనిఫారం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్త యూనిఫారం అందించకపోవడంతో అందరూ సివిల్ డ్రెస్సులతోనే పాఠశాలకు వస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో వ్యత్యాసం కనబడుతుంది. ప్రభుత్వం స్పందించి త్వరగా యూనిఫారాలు పంపిణీ చేయాలి.
పాఠశాలలు ప్రారంభమై నెలన్నర కావొస్తున్నా నేటికీ విద్యార్థులకు యూనిఫారం అందకపోవడం బాధాకరం ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌ను తక్షణమే పంపిణీ చేయాలి. లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు పాఠశాలల పునః ప్రారంభ సమయంలో దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించేవారు.
సాంకేతిక, పరిపాలనా పరమైన కారణాలతో యూనిఫారం సరఫరా ఆలస్యమైంది. ఈ మధ్యనే కేజీబీవీలకు, గురుకుల పాఠశాల విద్యార్థులకు యూనిఫారాలు అందజేశాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫారాలకు కావాల్సిన వస్త్రం వచ్చింది. కుట్టేందుకు మహిళా సంఘాలు ఇచ్చాం. వారు త్వరలో కుట్టి ఇస్తామన్నారు. 10 రోజుల్లో కుట్టు పని పూర్తి చేసి విద్యార్థులకు కొత్త యూనిఫారాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
ఈ ఏడాది నుంచి యూనిఫాంతో పాటు 24 వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15 నాటికి అన్ని పాఠశాలలకు కిట్లు చేరుస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఇప్పటివరకు వాటి పంపిణీ కూడా ప్రారంభం కాలేదు. యూనిఫారాలు కూడా ఈ కిట్లతోపాటే అందించాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో అది ఇప్పుడు సాధ్యమవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.