సారంగాపూర్, ఆగస్టు 1: తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని, నీళ్లు ఇస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే మోటర్లు ఆన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా రైతులపై ఆ దేవుడు దయతలచి అల్పపీడనం రూపంలో వర్షాలు కురిపించాడని, రైతులకు కొంత ఊరట కలిగిందని చెప్పారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రం శివారులోని రోళ్లవాగు ప్రాజెక్ట్ సమీపంలో కొన్నేండ్ల క్రితం ఏర్పాటు చేసిన మత్తడి వద్ద ఇటీవల వరద ప్రవాహానికి గండిపడి ప్రాజెక్ట్ వైపు వెళ్లే కాలువ అప్రోచ్ రోడ్డు తెగిపోయి పంటపొలాల్లోకి వరద ప్రవహిస్తున్నదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు.
శనివారం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు మత్తడి వద్ద గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ హయాంలో 90 శాతానికిపైగా పనులు పూర్తయిన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రం శివారులోని రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు గేట్లు ఎప్పుడు బిగిస్తరు? వర్షాలతో వరద నీరు వృథాగా పోతున్నా పట్టించుకోకపోతే ఎలా? ఇందుకు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, జగిత్యాల ఎమ్మెల్యే, ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ఎత్తిపోతలు.. ఉత్తిపోతలు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడటం సరికాదని, ప్రస్తుతం గాయత్రీ పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోస్తేనే ఎగువకు వరద కాలువకు నీళ్లు చేరుతున్నాయని చెప్పారు. రాంపూర్ పంప్‌హౌస్‌లో ఎత్తిపోస్తే ఎగువకు నీరు వెళ్తున్నదని, ఇవన్నీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అక్కడే ఉన్న డీఈ రవికుమార్.. జీవన్‌రెడ్డితో మాట్లాడుతూ ఈ నెల 15వరకు రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు గేట్లు బిగించి సాగునీరందిస్తామని, అలాగే లిఫ్ట్‌ల మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు.