మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అనేక మార్గాల ద్వారా ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సేకరిస్తుంది. ఇవేవి తెలియకుండా లావాదేవీలను తొక్కిపట్టాలని చూస్తే ఐటీ నోటీసులు తప్పవు. అలాంటివేవో చూద్దాం.
నగదు లావాదేవీలు
బ్యాంకుల్లో రూ.10 లక్షలకు మించి నగదును ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)గా లేదా సాధారణ డిపాజిట్ చేసినా.. ఉపసంహరించుకున్నా ఆ సమాచారం బ్యాంకర్ల ద్వారానే ఐటీ శాఖకు తెలుస్తుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లు
లక్ష రూపాయలకు మించి క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే కూడా ఐటీ శాఖకు తెలిసిపోతుంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షల రూపాయలకు మించి లావాదేవీలు క్రెడిట్ కార్డుతో జరిపినా ఐటీ శాఖకు చేరుతుంది. ఐటీ రిటర్నుల్లో వీటిని చూపాల్సిందే.
స్థిరాస్తి వ్యవహారాలు
స్థిరాస్తి కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లు అన్నీ పాన్ కార్డ్‌తో ముడిపడి ఉంటాయి. రూ.30 లక్షలకు మించిన స్థిరాస్తి కొనుగోళ్లన్నీ రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ శాఖకు నివేదిస్తుంది. స్థిరాస్తుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించి ఫామ్ 26ఏలో నమోదై ఉండాలి. లేదంటే మీరు ఆదాయ పన్ను దృష్టిలో పడ్డట్లే.
పెట్టుబడులు
స్టాక్ మార్కెట్లలో షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, డిబెంచర్లు ఇతర ఆర్థిక సాధానాల్లో రూ.10 లక్షలకు మించి మదుపు చేసినా ఐటీ శాఖ కన్నుపడుతుంది. ఇవన్నీ పాన్ కార్డ్‌తో లింకై ఉన్న అకౌంట్లే అన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి. అలాగే విదేశీ కరెన్సీలలో లావాదేవీలు రూ.10 లక్షలకు మించి చేసినా సరే ఐటీ శాఖకు తెలిసిపోతుందని మరువద్దు.