Repo Rate | న్యూఢిల్లీ, మే 13: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకున్న అవకాశాలు మెరుగయ్యాయి. గత నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేండ్ల కనిష్ఠానికి తగ్గింది. ఏప్రిల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.16 శాతంగా నమోదైనట్టు మంగళవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) డాటా చెప్తున్నది. 2019 జూలైలో 3.15 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ దరిదాపుల్లోకి ధరల సూచీ ఇప్పుడే శాంతించింది. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో రెపోరేటు ఇంకా దిగొస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో జరిగిన ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) చొప్పున మొత్తం అర శాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. ఫలితంగా 6 శాతానికి దిగొచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఓవరాల్గా 4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 3.6 శాతంగా, రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 3.9 శాతంగా, మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 3.8 శాతంగా, నాల్గో త్రైమాసికం (జనవరి-మార్చి)లో 4.4 శాతంగా నమోదు కావచ్చన్నది. ఈ ద్రవ్యోల్బణం ఆధారంగానే ఆర్బీఐ విధానాన్ని ప్రకటిస్తుందన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలవారీ గణాంకాలు అంచనాలకు తగ్గట్టుగానే వస్తుండటంతో వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయన్న అభిప్రాయాలు క్రమేణా పెరుగుతున్నాయి.
ఏప్రిల్లో కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, ఇతర ప్రొటీన్ సమృద్ధి ఆహారోత్పత్తుల ధరలు శాంతించాయి. దీంతో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 1.78 శాతంగానే ఉన్నది. 2021 అక్టోబర్ తర్వాత ఇదే తక్కువ. గతంతో పోల్చితే ఆలుగడ్డ, టమాట, చికెన్, జీరా వంటివాటి ధరలు తగ్గాయని ఎన్ఎస్వో చెప్పుకొచ్చింది. ఇక అంతకుముందు నెల మార్చిలో 2.69 శాతంగా, నిరుడు ఏప్రిల్లో 8.7 శాతంగా ఆహార ద్రవ్యోల్బణం ఉండటం గమనార్హం. అలాగే రిటైల్ ధరల సూచీ కూడా ఈ మార్చిలో 3.34 శాతంగా, గత ఏడాది ఏప్రిల్లో 4.83 శాతంగా ఉన్నట్టు ఎన్ఎస్వో ఈ సందర్భంగా తెలియజేసింది.