మధుమేహం..క్యాన్సర్..గుండెజబ్బు.. ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా చలికాలంలో ఆమ్లాను తీసుకుంటే.. ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. పరిగడపున తింటే..మంచి ఫలితం ఉంటుందని.. రోగనిరోధక శక్తి పెరిగి.. రోగాలను దరిచేరనివ్వదంటున్నారు.
మేడ్చల్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ : ప్రకృతి ప్రసాదించిన అపురూప వరం..ఉసిరి(ఆమ్లా).. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. అత్యంత శక్తివంతమైప పండ్లలో ఒకటిగా చెబుతారు. ఎన్నో ఔషధ గుణాల కారణంగా పూర్వకాలం నుంచి ఆమ్లాను ఉపయోగిస్తున్నారు.
ఆ రోగులను తగ్గిస్తుంది..
మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బు, రక్తపోటు మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నివారిస్తుంది. ఇన్సూలిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకం, థైరాయిడ్, అసిడిటీ ఇబ్బందులు ఉన్నవారు ఉసిరి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. వాత, పిత్త, కఫంను సమస్థితులకు తీసుకొచ్చి.. వ్యాధులు దరి చేరకుండా చేస్తుందని వివరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో తీసుకుంటే..
ఉసిరి పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.టీ స్ఫూన్ ఉసిరి పొడిని టీ స్ఫూన్ తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా గోరు వెచ్చని నీళ్లలో కలిపి తీసుకున్నా.. ప్రయోజనం కలుగుతుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనైనా తీసుకోవచ్చు. ఇందులో పుష్కలంగా విటమిన్ సీ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రస్తుత చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయను తింటే.. చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
-శ్రీనివాస్, ఆయూష్ ప్రభుత్వ వైద్యాధికారి