ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో తడబడుతూ సాగుతున్న భారత జట్టు.. శనివారం ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గి.. రెండింట ఓడిన మిథాలీ సేన.. ఆసీస్‌పై సమిష్టిగా సత్తాచాటితేనే ముందడుగు వేసే అవకాశాలున్నాయి. సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ విజయం కీలకం కానున్న నేపథ్యంలో టీమ్ఇండియా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. ‘మెగాటోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మా బ్యాటింగ్ బృందం ఆకట్టుకుంది. కానీ ప్రపంచకప్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాం. కలిసి కట్టుగా ఆడితేనే భారీ స్కోర్లు చేయగలం’ అని స్మృతి పేర్కొంది.