కొలంబో: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్టును ఆ దిశగా సన్నద్ధం చేసేందుకు టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. ‘మనముందు ఏ లక్ష్యముందో అందరికీ తెలుసు’ అంటూ జట్టులో స్ఫూర్తి రగిలించేలా హితబోధ చేశాడు.
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్.. శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న సందర్భంగా ఏర్పాటుచేసిన తొలి ప్రాక్టీస్ సెషన్లో గౌతీ మాట్లాడుతూ.. ‘మన ముందు ఏ లక్ష్యం ఉందో, ఎందుకోసం ఆడుతున్నామో మనందరికీ తెలుసు. మనకు ఎదరయ్యే ప్రతీ అడ్డంకిని అధిగమించగలం.
15న లంకతో మొదలయ్యే తొలి టెస్టులో మనం మొదట బౌలింగ్ చేసినా, బ్యాటింగ్‌కు వచ్చినా ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. మనకు ఎదురయ్యే ప్రతి సవాల్‌కు జవాబిచ్చేలా సన్నద్ధమవ్వాలి’ అని జట్టుకు స్ఫూర్తినిచ్చేలా వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను బీసీసీఐ తమ సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసింది.
ఈ ప్రసంగానికంటే ముందు గంభీర్, జట్టులోకి కొత్తగా వచ్చిన సారాంశ్ జైన్, ఆకిబ్ నబీకి స్వాగతం చెబుతూ.. ‘మన జట్టులో ఇద్దరు కొత్తవాళ్లు వచ్చారు. ముందుగా సారాంశ్‌కు శుభాకాంక్షలు. నువ్వు ఇక్కడకు రావడానికి చాలా కష్టపడ్డావు. నీకు అవకాశం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు, దేశాన్ని గర్వించేలా చేయాలి. ఇక, ఆకిబ్.. దేశవాళీలో భాగంగా గత సీజన్లో అద్భుతంగా ఆడావు. జమ్మూకశ్మీర్‌కు రంజీ ట్రోఫీ దక్కడంలో నీ కృషి ఎంతో ఉంది. నీకు శుభాకాంక్షలు’ అని వారిని అభినందించాడు. ఇటీవలే జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైన సుబదీప్ ఘోష్‌ను గంభీర్.. ఆటగాళ్లకు పరిచయం చేశాడు.
స్పిన్‌కు స్వర్గధామమైన లంక పిచ్‌లపై ప్రత్యర్థి స్పిన్నర్ల నుంచి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రత్యేక దృష్టి సారించారు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా స్పిన్నర్ల చేతిలో చావుదెబ్బ తిన్న మెన్ ఇన్ బ్లూకు.. లంకలోనూ అదే తరహా సవాల్ ఎదురవనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గిల్, ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ స్పిన్ బౌలింగ్‌లోనే ప్రాక్టీస్ చేశారు. కాగా ప్రస్తుత జట్టులో ఉన్న చాలామందికి లంకలో ఇదే తొలి టెస్టు సిరీస్. 2017 తర్వాత భారత్ లంకలో టెస్టులు ఆడలేదు. అప్పుడు టీమిండియాకు ఆడినవారిలో రాహుల్, కుల్దీప్, జడేజా మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. తొలిరోజు నుంచే బంతి గింగిరాలు తిరిగే లంక పిచ్‌లపై అలవాటుపడేందుకు గాను భారత బ్యాటర్లకు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడనుంది.
లంకతో సిరీస్‌కు ఎంపికైనా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేక జట్టుతో అక్కడకు వెళ్లని యువ బ్యాటర్ సాయి సుదర్శన్.. శనివారం టీమ్‌తో కలువనున్నాడు. కాలి బొటనవేలి గాయం కారణంగా సీవోఈలో పునరావాసం పొందిన సాయి.. వారాంతానికల్లా పూర్తి ఫిట్నెస్ సాధించి అక్కడకు వెళ్లనున్నట్టు సమాచారం. ప్రాక్టీస్ మ్యాచ్‌కు మిస్ అయినా తొలి టెస్టు వరకు అతడు మ్యాచ్‌కు అందుబాటులోకి ఉంటాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇటీవల భారత-ఏ జట్టు తరఫున శ్రీలంకతో ఆడిన అనధికారిక టెస్టు సిరీస్‌లో సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ అనుభవంతో ఈ సిరీస్‌లోనూ రాణించి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఈ తమిళనాడు క్రికెటర్ ఆరాటపడుతున్నాడు.