Team India | మెల్బోర్న్ : ఐపీఎల్ మూడ్‌లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా 2025-26కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 19 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 23న ముగియనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నాలుగు రోజులకు ధనాధన్ క్రికెట్ మజా మొదలవుతుంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 08 దాకా ఐదు టీ20లను నిర్వహించనున్నారు. మూడు వన్డేలు డే అండ్ నైట్ మ్యాచ్‌లు కాగా టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు రాత్రే జరుగుతాయి.
అమ్మాయిల ఆల్ ఫార్మాట్ సిరీస్ : పురుషులతో పాటు భారత మహిళల జట్టు సైతం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. 2026 ఫిబ్రవరి-మార్చిలో భారత్..ఆసీస్‌తో 3 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్టు ఆడనుంది. ఫిబ్రవరి 15-21 మధ్య టీ20 సిరీస్ జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 01 దాకా వన్డే సిరీస్ జరుగనుంది. మార్చి 6 నుంచి పెర్త్‌లోని వాకా మైదానంలో ఏకైక టెస్టు (పింక్) ఆతిథ్యమివ్వనుంది.