కకామిగహర(జపాన్): అండర్-18 ఆసియాకప్ ఫైనల్లోకి యువ భారత్ దూసుకెళ్లింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో యువభారత్ 5-3 తేడాతో పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. అశిష్ తనీ పుర్తి(12ని, 49ని, 53ని, 56ని) నాలుగు గోల్స్‌తో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఆఖరి క్వార్టర్ వరకు 2-3తో వెనుకంజలో ఉన్న భారత్..చివరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకుని వరుస గోల్స్‌తో చిరకాల ప్రత్యర్థిపై పాక్‌పై విరుచుకుపడింది. మ్యాచ్ మొదలైన మొదటి నిమిషం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 12వ నిమిషంలో పాక్ డిఫెన్స్ లోపాన్ని అనుకూలంగా మలుచుకుంటూ అశిష్..యువ భారత్‌కు తొలి గోల్ అందించాడు.
అయితే రెండో క్వార్టర్లో పుంజుకున్న పాక్..భారత్ గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగింది. ఈ క్రమంలో 27వ నిమిషంలో అదిల్ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. మూడో క్వార్టర్ 35వ నిమిషంలో షారుఖ్ అలీ గోల్‌తో భారత్ ఆధిక్యం 2-1కి చేరగా, పాక్..ఫర్హాన్ అస్లాం(37ని), ఉజైర్ అహ్మద్(42ని) వరుస గోల్స్‌తో ఆధిక్యం 3-2కు చేరుకుంది. అయితే ఆఖరి క్వార్టర్లో యువ భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ క్రమంలో అశిష్ (49ని, 53ని, 56ని) వరుస గోల్స్ చేయడంతో భారత్ ఫైనల్ బెర్తు ఖరారైంది. శనివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో యువ భారత్ తలపడుతుంది.