India : భారత యుద్ధ నౌకను ఇటీవల పాక్ నౌక ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 15, సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం స్పందించిన తీరుపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పాక్ స్పందించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంలో పాకిస్తాన్ స్పందన సరిగ్గా లేదని, ఎప్పట్లాగే ధాటవేత ధోరణిని పాక్ అనుసరించిందన్నారు. అలాగే, పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ కోల్కతా నౌక సాధారణంగా గస్తీ నిర్వహిస్తుండగా.. పాకిస్తాన్కు చెందిన నేవీ నౌక హునైన్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో పాక్ నౌక వ్యవహరించిన తీరు అనైతికంగా ఉంది. ఇది ఇండియా-పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 10ని ఉల్లంఘించడమే. ఏప్రిల్, 1991లో కుదిరిన ఒప్పందంను అనుసరించి.. పీఎన్ఎస్ హునైన్ నౌక ప్రమాదకరంగా వ్యవహరించిందన్నారు.
అలాగే, అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రమాదాలు జరగకుండా ఉన్న చట్టాల్ని కూడా పాకిస్తాన్ ఉల్లంఘించిందని రణధీర్ జైశ్వాల్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు.. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ ఆర్మీ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. భారత నౌకను ఢీకొన్న ఘటనలో పాకిస్తాన్ నౌక ఎక్కువగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, భారత నౌకకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన తర్వాత భారత నౌక సముద్ర జలాల్లో ఎప్పట్లాగే ప్రయాణించింది.