India : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దాడుల్ని ఆపాలని బంగ్లా ప్రభుత్వానికి భారత్ సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. మైనారిటీ హిందువులపై దాడులు ఆపేందుకు బంగ్లా ప్రభుత్వం వేగంగా, కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
‘‘బంగ్లాలో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువుల ఇండ్లపై, వ్యాపార సంస్థలపైనా అతివాదులు దాడి చేస్తున్నారు. వ్యక్తిగత ద్వేషాలు, రాజకీయ కారణాల వల్ల జరుగుతున్న ఈ మతపరమైన దాడుల్ని వెంటనే ఆపాలి. ఈ దాడులు మైనారిటీలలో భయాన్ని, అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి ’’ అని రణధీర్ అన్నారు. మరోవైపు బంగ్లాలో హిందువులపై దాడుల గురించి బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ కూడా స్పందించారు. బ్రిటన్ ఫారెన్ సెక్రటరీకి లేఖ రాశారు. దాడుల్ని ఆపేందుకు సహకరించాలని కోరారు. హిందువులపై హత్యలతో బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, మత స్వేచ్ఛను గౌరవిస్తూ ఈ దాడులు ఆపేలా చూడాలని ఆమె లేఖలో కోరారు.
The situation in Bangladesh is very concerning. Religious freedoms should be protected and the murders of Hindus and persecution taking place are wrong and must stop.
The UK Government must use its influence and convening powers to work to bring about stability in Bangladesh… pic.twitter.com/VsVuPexXAY
— Priti Patel MP (@pritipatel) January 9, 2026
ఈ అంశంలో బ్రిటన్ ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమ అధికారాన్ని వాడాలని ఆమె కోరారు. బంగ్లాలో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు, స్థిరత్వానికి సహకరించాలన్నారు. ఇటీవలి కాలంలో బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.