పేసర్లకు స్వర్గధామంలాంటి గబ్బా పిచ్‌పై ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమ్ ఇండియా.. స్వింగ్‌కు రెడ్ కార్పెట్ పరిచే సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై విజయంతో ముగింపు పలికింది. సుదీర్ఘ టెస్టు చరిత్రలో ఏ ఆసియా జట్టు సాధించలేని ఘనతను ఖాతాలో వేసుకున్న కోహ్లీ సేన.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేసింది! గత కొంత కాలంగా విదేశీ పిచ్‌లపై రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్న భారత పేసర్లు మరోసారి విశ్వరూపం కనబర్చడంతో సఫారీలకు పరాజయం తప్పలేదు.
సెంచూరియన్: సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ సాధ్యంకాని.. సెంచూరియన్ టెస్టు విజయాన్ని టీమ్ఇండియా ఒడిసి పట్టింది. బ్యాటర్ల కృషికి పేసర్ల సహకారం తోడవడంతో దశాబ్దాల కల సాకారమైంది. దీంతో సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో టెస్టు మ్యాచ్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా కోహ్లీసేన రికార్డుల్లోకెక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో 1-0తో సిరీస్‌లో ముందంజ వేసింది. ఓవర్‌నైట్ స్కోరు 94/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా.. చివరకు 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (77) ఒంటరి పోరాటం చేయగా.. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా.. సఫారీ జట్టు 197 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థి ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి జొహన్నెస్‌బర్గ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. మరోవైపు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 327, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 197, భారత్ రెండో ఇన్నింగ్స్: 174, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (ఎల్గర్ 77, బవుమా 35 నాటౌట్; బుమ్రా 3/50, షమీ 3/63).