IND vs ENG | లార్డ్స్ : భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య జట్టును కట్టడిచేసిన టీమ్ఇండియా.. తర్వాత బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతున్నది. టాపార్డర్ విఫలమైనప్పటికీ ఓపెనర్ కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 53 నాటౌట్, 5 ఫోర్లు) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో అర్ధ శతకంతో మెరవగా కరుణ్ నాయర్ (40)రాణించాడు. రాహుల్‌తో పాటు రిషభ్ పంత్ (19 నాటౌట్) క్రీజులో ఉండగా రెండో రోజు ఆట చివరికి టీమ్ఇండియా.. 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గిల్ సేన ఇంకా 242 రన్స్ వెనుకబడి ఉంది. అంతకుముందు 251/4తో రెండో రోజు ఆరంభించిన ఇంగ్లండ్.. మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్ (104) శతకాన్ని పూర్తిచేసుకోగా లోయరార్డర్లో బ్రైడన్ కార్స్ (56), జెమీ స్మిత్ (51) అర్ధ శతకాలతో ఆ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (5/74) ఐదు వికెట్లతో విజృంభించగా సిరాజ్ (2/62) రెండు వికెట్లు తీశాడు. మూడో రోజు భారత్ ఎలా ఆడుతుందనేదానిపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
11 పరుగుల వ్యవధిలో ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లండ్ 300 పరుగుల్లోపు ఆలౌట్ అవుతుందని భావించినా భారత పేసర్లు మరోసారి పట్టు విడిచారు. ఈ సిరీస్‌లో మంచి ఫామ్ మీదున్న స్మిత్.. వ్యక్తిగత స్కోరు ఒక్క పరుగు వద్ద సిరాజ్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో రాహుల్ వదిలేయడం భారత్ కొంపముంచింది. ఆ అవకాశాన్ని అతడు చక్కగా వినియోగించుకున్నాడు. కార్స్‌తో కలిసి 8వ వికెట్‌కు అతడు 84 రన్స్ జోడించడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే లంచ్ విరామం తర్వాత రెండో ఓవర్లో సిరాజ్.. స్మిత్‌ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. బుమ్రా.. ఆర్చర్ (4)ను క్లీన్‌బౌల్డ్ చేసి లార్డ్స్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కార్స్‌ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది.
ఆతిథ్య జట్టు మాదిరిగానే భారత్ సైతం ఆరంభంలో తడబడింది. వోక్స్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే మూడు బౌండరీలు బాది జోరు కనబరిచిన యశస్వీ జైస్వాల్ (14) ఆర్చర్ రెండో ఓవర్లో సెకండ్ స్లిప్స్‌లో బ్రూక్‌కు చిక్కడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కానీ మూడోస్థానంలో వచ్చిన కరుణ్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందు కు నడిపించాడు. క్రీజులో కుదురుకునేదాకా ఆచితూచి ఆడిన కరుణ్.. ఆర్చర్ బౌలింగ్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో అలరించాడు. కరుణ్ కాస్త వేగంగా ఆడినా రాహుల్ మాత్రం ఆచితూచి ఆడాడు. క్రీజులో నిలదొక్కుకున్న కరుణ్.. టీ విరామం తర్వాత స్టోక్స్ బౌలింగ్‌లో స్లిప్స్ వద్ద రూట్ వన్ హ్యాండెడ్ క్యాచ్‌తో అతడు నిష్క్రమించాల్సి వచ్చింది. రెండో వికెట్‌కు రాహుల్, కరుణ్ జోడీ 61 పరుగులు జోడించింది. అతడి స్థానంలో వచ్చిన కెప్టెన్ గిల్ (16) నిరాశపరిచాడు. చేతి గాయంతో వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న పంత్.. బ్యాటింగ్‌కు వచ్చి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రాహుల్.. తన కెరీర్లో 19వ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387 ఆలౌట్ (రూట్ 104, కార్స్ 56, బుమ్రా 5/74, నితీశ్ 2/62);
భారత్ తొలి ఇన్నింగ్స్: 43 ఓవర్లలో 145/3 (రాహుల్ 53*, కరుణ్ 40, స్టోక్స్ 1/16, ఆర్చర్ 1/22)
రెండో రోజు తొలి సెషన్ ఆరంభం కాగానే బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ మిడిలార్డర్ కకావికలమైంది. అతడు వేసిన తొలి ఓవర్లో మొదటి బంతిని బౌండరీకి తరలించిన జో రూట్ (104) టెస్టులలో 37వ శతకాన్ని నమోదుచేశాడు. కానీ ఇంగ్లండ్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. బుమ్రా రెండు ఓవర్ల వ్యవధిలో ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. 86వ ఓవర్లో స్టోక్స్ (44)ను అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేసిన బుమ్రా.. తన మరుసటి ఓవర్లో ఆతిథ్య జట్టుకు డబుల్ స్ట్రోకులిచ్చాడు. 88వ ఓవర్లో మొదటి బంతి రూట్ బ్యాట్‌కు తాకి మిడిల్ వికెట్‌ను గిరాటేసింది. రెండో బంతికి వోక్స్.. వికెట్ కీపర్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.