న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య గత నెల రోజుల నుంచి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా టూర్లో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ఇండియా మధ్యవర్తిగా మారే అవకాశాలు ఉన్నాయా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నలకు లవ్రోవ్ సమాధానం ఇచ్చారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ చాలా ముఖ్యమైన దేశమని, ఒకవేళ సమస్యను పరిష్కరించే పాత్రను భారత్ పోషిస్తే తాము ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమస్యల పట్ల ఇండియా తర్కబద్ధంగా వ్యవహరించగలిగితే దాంట్లో సమస్యేమీ లేదన్నారు.
ఉక్రెయిన్‌పై ఆక్రమణకు రష్యా వెళ్లినట్లు మీడియా వ్యాఖ్యానిస్తోందని, ఇది నిజం కాదు అని, తాము ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టామని ఆయన అన్నారు. కేవలం సైనిక కేంద్రాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు లవ్రోవ్ చెప్పారు. రష్యాకు ప్రమాదకరంగా మారకుండా కీవ్‌లో ప్రభుత్వాన్ని అస్థిరం చేయడమే లక్ష్యమన్నారు.