ఆసియా గేమ్స్‌లో పతక పోటీల ఆఖరి రోజు భారత్ ఐదు స్వర్ణాలతో మెరిసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను పడగొట్టి పురుషుల క్రికెట్ జట్టు.. మలేషియాను మట్టి కరిపించి హాకీ జట్టు తమ పసిడి పతకాలను నిలబెట్టుకున్నాయి. ఒలింపిక్ మెడలిస్ట్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణ పట్టుతో సత్తా చాటితే.. 17 ఏండ్ల యువ ఆర్బర్ కుంకుమ్ మొహోద్, గోల్ఫర్ ప్రణవి చరిత్రాత్మక స్వర్ణాలతో రికార్డు సృష్టించారు.
21 స్వర్ణాలు.. 27 రజతాలు, 37 కాంస్యాలతో 85 పతకాలు అందుకున్న భారత్ నాలుగో స్థానం దాదాపు ఖాయం చేసుకుంది. ఐదో ప్లేస్‌లో ఉన్న ఉజ్బెకిస్థాన్ చివరి రోజు ఈక్వెస్ట్రియన్ పోటీల్లో స్వర్ణం అందుకోకపోతే భారత ర్యాంకులో మార్పు ఉండదు.
ఆసియాడ్ టాప్-5లో నిలవాలన్న భారత్ లక్ష్యం నెరవేరినా గత ఎడిషన్ (106) మాదిరిగా ‘పతక శతకానికి‘ మాత్రం చాలా దూరంలో నిలిపోయింది. ఎప్పట్లానే చైనా అగ్రస్థానం అందుకుంది. ఏకంగా 169 స్వర్ణాలు సహా 341 పతకాలతో ఆసియాలో తిరుగులేని శక్తిగా కొనసాగుతోంది. ఆదివారం జరిగే ముగింపు వేడుకలతో ఆసియాడ్ మెరుపులకు తెరపడనుంది.
నిషిన్ (జపాన్): టోర్నమెంట్ ఏదైనా.. పోటీ ఎక్కడైనా క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్ జట్టు ఎదురుపడితే భారత జట్టు పూనకం వచ్చినట్టు రెచ్చిపోతోంది. వరల్డ్ కప్స్, ఆసియా కప్స్‌లో దాయాదిని దంచేస్తున్న టీమిండియా ఆసియా గేమ్స్‌లోనూ పొరుగు జట్టు పని పట్టింది. ఆసియాడ్ టీ20 క్రికెట్ ఫైనల్లో పాక్‌ను పడగొట్టిన భారత్ వరుసగా రెండో స్వర్ణం అందుకుంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ వర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61), హైదరాబాదీ తిలక్ వర్మ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) మెరుపు అర్ధ శతకాలతో విజృంభించిన వేళ శనివారం జరిగిన తుదిపోరులో 19 పరుగుల తేడాతో గెలిచిన భారత్ టైటిల్ నిలబెట్టుకుంది. ఆశించినట్టే ఉత్కంఠ రేపిన ఈ పోరులో తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో పాక్ ఓవర్లన్నీ ఆడి 192/6 స్కోరు చేసి ఓడింది. హసన్ నవాజ్ (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) పోరాడినా.. అక్షర్ పటేల్ (2/29), సుందర్ (2/29), శివం దూబే (2/33) ఆ జట్టును నిలువరించారు.

ఆరంభంలో శర్మ.. ఆఖర్లో వర్మ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం ఇచ్చాడు. రెండో ఓవర్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15) రెండు సిక్సర్లు, అభి 6,4తో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో వైభవ్, ఐదో ఓవర్లో శాంసన్ (2) ఔటైనా.. మరో ఎండ్‌లో అభి సిక్సర్ల వర్షం తగ్గలేదు. డానియల్ బౌలింగ్‌లో సిక్స్‌తో 20 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. పవర్‌ప్లేను భారత్ 81/2తో ముగించింది. సెంచరీ చేసేలా కనిపించిన అతడిని 8వ ఓవర్లో మిన్హాస్ ఔట్ చేశాడు.
ఆ తర్వాత ఇషాన్(20), కెప్టెన్ అయ్యర్ (21) నిలకడగా ఆడినా మిన్హాస్, అబ్రార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 133/5తో కాస్త తడబడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ తిలక్, శివం దూబే (27) ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిలో పెట్టాడు. చివరి మూడు ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మోఖిమ్ వేసిన 18వ ఓవర్లో తిలక్ 4, 6, 6 కొడితే.. ఆయుబ్ ఓవర్లో దూబే కూడా 6, 6,4తో దంచాడు.ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించిన తర్వాత ఆఖరి ఓవర్ తొలి బాల్కే దూబే ఔటైనా.. తిలక్ రెండు భారీ సిక్సర్లతో జట్టు స్కోరు 210 మార్కు దాటించాడు.
భయపెట్టిన నవాజ్
అనామక ఆటగాళ్లతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఛేదనలో గట్టిగానే పోరాడింది. తొలి ఏడు ఓవర్లలోనే టాప్-3 బ్యాటర్లయిన కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ (10), సదాఖత్ (23), ఉస్మాన్ ఖాన్ (3)ను వెనక్కుపంపిన స్పిన్నర్లు పాక్‌ను 39/3తో నిలపడంతో భారత్ అలవోక విజయం సాధించేలా కనిపించింది. కానీ,యువ బ్యాటర్ హసన్ నవాజ్ భారీ షాట్లతో విరుచుకుపడి భయపెట్టాడు. ఆరంభంలోనే వైభవ్ సూర్యవంశీ క్యాచ్ వదిలేయడంతో లభించిన అవకాశాన్ని ఉపయోగించుకున్న నవాజ్, సైమ్ ఆయుబ్ (29)తోడుగా నవాజ్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు.
28 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 15వ ఓవర్లో ఆయుబ్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 87 రన్స్ (48 బంతుల్లో) పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేసిన శివం దూబే భారత్‌ను మళ్లీ రేసులోకి చెచ్చాడు. బుమ్రా, సుందర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. నవాజ్ వెనక్కుతగ్గకుండా జోరు కొనసాగించాడు. 18 బంతుల్లో ఆ జట్టుకు 52 రన్స్ అవసరం అవగా.. 18 ఓవర్లో సమద్ (9) వికెట్ తీసిన సుందర్ 8 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. లాస్ట్ ఓవర్లో 29 పరుగులు అవసరం అవగా.. ఓ ఫోర్, సిక్స్ కొట్టి ఆఖరి బాల్‌కు నవాజ్ ఔటవడంతో పాక్ రజతంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లోనూ ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు.
6/6 2024 టీ20 ప్రపంచకప్ నుంచి ఈ ఫార్మాట్లో పాకిస్థాన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది.