బర్మింగ్హామ్ : టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దష్కటే జట్టును వీడే యోచనలో ఉన్నాడు. కోచ్గా రెండేండ్ల కాంట్రాక్టు పూర్తవడంతో ఇంగ్లండ్తో ఈ నెల 19న ముగిసే చివరి వన్డే తర్వాత కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తనను రిలీవ్ చేయాలని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. బోర్డు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓకే చెబితే మూడో వన్డే తర్వాత ర్యాన్ జట్టుకు వీడ్కోలు పలకనున్నాడు. ముగ్గురు కొడుకుల తండ్రి అయిన దష్కటే వ్యక్తిగత కారణాలతోనే కోచ్ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్టు బోర్డుకు సమాచారం అందించాడు. నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ అయిన ర్యాన్ కుటుంబం లండన్లో నివాసం ఉంటుంది.
తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు భారత జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అతను నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో జట్టులో తనకు అప్పగించిన పాత్ర పట్ల అతను అసంతృప్తితో ఉన్నట్టు సమచారం. అసిస్టెంట్ కోచ్గా దష్కటే ప్రధానంగా ఫీల్డింగ్ బాధ్యతలు చూడాలి. కానీ, హైదరాబాదీ టి. దిలీప్ రూపంలో జట్టులో ప్రత్యేక ఫీల్డింగ్ కోచ్ ఉండటంతో దష్కటే పాత్ర పరిమితమైంది. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా రాజీనామా చేస్తాడని వస్తున్న వార్తలను బోర్డు వర్గాలు ఖండించాయి. ద్రవిడ్ హయాం నుంచి ఫీల్డింగ్ కోచ్గా ఉన్న దిలీప్ జట్టుతో కొనసాగుతాడని స్పష్టం చేశాయి.