హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : గత ఆరు నెలల్లో రూ.45,900 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు.. మరో రూ.4వేల కోట్ల అప్పునకు ఆర్బీఐకి శుక్రవారం ఇండెంట్ పెట్టింది. ఈ నెల 30న నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సేకరిస్తామని పేర్కొన్నది. ఈ మేరకు 27, 29, 31, 33 ఏండ్ల కాలాలకు రూ.1,000 కోట్ల చొప్పన మొత్తం రూ.4,000 కోట్లకు సెక్యూరిటీ బాండ్లు పెట్టారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు తీసుకుంటామని రేవంత్రెడ్డి సర్కారు బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఆరునెలల్లోనే ఒక్క ఆర్బీఐ నుంచే రూ.49,900 కోట్ల అప్పు తీసుకుంటున్నది. కాంగ్రెస్ సర్కారు ఆదాయ రాబడిలో 35 శాతం దాటడం లేదు. కానీ, అప్పుల సేకరణలో మాత్రం 92 శాతాన్ని దాటితుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.