కాసిపేట : విద్యార్థులకు బోధన ఉపకరణాలతో ( Teaching aids ) బోధించడం వల్ల ఆసక్తి పెరుగుతుందని మంచిర్యాల డీఈవో ఎస్ యాదయ్య ( DEO Yadayya ) పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట ఉన్నత పాఠశాలలో మండల స్థాయి బోధనోపకరణాల మేళా నిర్వహించారు. ఈ మేళాను డీఈవో ప్రారంభించి ప్రతి బోధనోపకరణాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను అభినందించారు.
ఆయన మాట్లాడుతూ బోధనోపకరణాలు విద్యార్థుల్లో అభ్యాసం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదపడతాయన్నారు. ప్రతి పాఠశాలలో బోధనోపకరణాల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. బోధనోపకరణాలు బోధనలో కీలక పాత్ర పోషిస్తాయని, ఉపాధ్యాయులు బోధనోపకరణాల ద్వారా విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు దరి సత్యనారాయణ మూర్తి, విజయ లక్ష్మీ, మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి, కాంప్లెక్స్ హెచ్ఎంలు మామిడిపెల్లి సాంబమూర్తి, రమేష్ రాథోడ్, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.