హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వేదధర్మ పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్నదని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. ధార్మిక సేవాతత్పరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. యాదాద్రి దేవాలయం దేశంలోనే ప్రముఖ ఆలయంగా నిలుస్తుందని, పురోహితులు, వేద పండితులకు ఉపాధి అవకాశాలు పెరిగే ఆస్కారమున్నదని చెప్పారు. జనార్దనానంద సరస్వతిస్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని వనస్థలిపురంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ వేద విద్వన్మహాసభలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణాచారి మాట్లాడారు. ఈ సారి మహాసభల్లో 350 మంది వేద విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో శృంగేరీ ఆస్థాన పండితులు పురాణం మహేశ్వరశర్మ, దోర్భల ప్రభాకరశర్మ, నరేంద్ర కాప్రే, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు ఎంవీఆర్ శర్మ, ట్రస్టు ప్రముఖులు సాయినాధ్శర్మ, బ్రహ్మానందశర్మ, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.