e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News మన నేలపైన.. మనసు పడిన వాన

మన నేలపైన.. మనసు పడిన వాన

  • పచ్చని తెలంగాణపై చల్లని వానలు
  • మూడేండ్లుగా రాష్ట్రంలో అధిక వర్షాలు
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టుల పుణ్యం
  • కలిసొచ్చిన తెలంగాణకు హరితహారం
  • హైదరాబాద్‌, వరంగల్‌లో కుండపోత
  • వెతుక్కుంటూ వస్తున్న అల్పపీడనాలు
  • ఈ సీజన్‌లో ఇప్పటికే 8 అల్పపీడనాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (నమస్తే తెలంగాణ): మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల ప్రభావం వాతావరణంపై కనపడుతున్నది. ప్రత్యేకించి ఈ మూడేండ్లుగా రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో వర్షాలు కురిశాయి. ఉమ్మడి రాష్ట్రంలో కరువుకాటకాలకు నిలయంగా మారిన తెలంగాణ 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ సమతుల్యతపై దృష్టిపెట్టడం ఇప్పుడు ఫలితాలనిస్తున్నది. ఆ ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి ఏటా అతితక్కువ వర్షం కురిసే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది భారీవర్షాలు కురిశాయి. ఈ జిల్లాలో సాధారణ వర్షపాతం 774.7 మిల్లీ మీటర్లు కాగా 1409.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 82% అధిక వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. ఈ ఏడాది సాధారణం కన్నా జోగులాంబ గద్వాలలో 11 శాతం, పెద్దపల్లిలో 8, ములుగు, సూర్యాపేటల్లో 7, నాగర్‌ కర్నూల్‌లో 3 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఇక మంచిర్యాలలో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఈ ఆరు జిల్లాల్లో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. మిగతా అన్ని జిల్లాల్లో అధికవర్షం కురిసింది. రాజన్న సిరిసిల్లలో 82 శాతం ఎక్కువ కురవగా.. సిద్దిపేటలో 81, హన్మకొండలో 70, నారాయణపేట 63, కరీంనగర్‌ 61, నిజామాబాద్‌ 56, వరంగల్‌, రంగారెడ్డి 46, నిర్మల్‌, జనగామ 42, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌ 41 శాతం అదనంగా వర్షాలు కురిశాయి. రాష్ట్ర సగటు తీసుకుంటే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 34 శాతం ఎక్కువ వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. గత ఏడాది 40 శాతం అధికవర్షం కురువగా 2019లో 6 శాతం అధికంగా కురిసింది.

పెరిగిన వాతావరణ సమతుల్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మిషన్‌ కాకతీయ పథకం కింద సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించారు. ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. వీటికి తోడు అడవుల పునరుద్ధరణ కోసం చేపట్టిన తెలంగాణకు హరితహారం కూడా వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో గణనీయమైన పాత్ర పోషించింది. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పచ్చదనం పెరిగింది. ఈ మార్పుల ప్రభావం కారణంగా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. మేఘాలను ఆకర్షిస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశం కూడా చాలా ముందుగా జరుగుతున్నది. ఈ ఏడాది జూన్‌ 5వ తేదీనే రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం గమనార్హం. సముద్రంలో జరిగే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఏ ద్రోణి వచ్చినా తెలంగాణ వైపు ఆకర్షితమవుతున్నదని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ముఖ్యంగా సెంట్రల్‌ బెల్ట్‌ మహబూబాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మంచి వర్షాలు కురుస్తున్నాయని ఆమె వివరించారు..

- Advertisement -

పట్టణాల్లో కాలుష్యం ప్రభావంతో..
పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో ఉష్ణోగ్రత మార్పుల వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో మినీ క్లౌడ్‌బరస్ట్‌ వల్ల ఒకే చోట్ల భారీవర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఒక్క గంటకు 8 నుంచి 10 సెంటీమీటర్ల భారీవర్షం కురిసేది. కానీ ఇప్పుడు అరగంటలో ఆరేడు సెంటీమీటర్ల వర్షం కురుస్తున్నదని చెప్తున్నారు. ఇదే తీరుగా వరంగల్‌ నగరంలోనూ ఒకేచోట ఇలాంటి వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ తెలిపారు.

పెరిగిన అల్పపీడనాల సంఖ్య
భూతాపం పెరగడం వల్ల అల్పపీడనాలు అధికమయ్యాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. గతేడాది ఆరు అల్పపీడనాలు ఏర్పడగా, ఈ ఏడాది 8 అల్పపీడనాలు వచ్చాయని చెప్పారు. వీటి ప్రభావం ప్రత్యేకంగా తెలంగాణ మీద కనిపిస్తున్నదని అన్నారు. ఈ ఏడాది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కంటే ఎక్కువ వర్షం తెలంగాణలో కురిసిందని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement