చెన్నై : తమ ఖాతాల్లో కోట్లు జమయినట్టు హెచ్డీఎఫ్సీ చెన్నై కస్టమర్ల ఫోన్లకు మేసేజలు రావడంతో వారంతా కొన్ని గంటల పాటు కోటీశ్వరులయ్యారు. సాంకేతిక లోపంతో ఇలా జరగడంతో పలువురు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు ఇలాంటి మెసేజ్‌లు వెళ్లాయి. టీ నగర్ బ్రాంచ్‌కు చెందిన 100 ఖాతాల్లో భారీగా నగదు డిపాజిట్ అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి. కొన్ని ఖాతాల్లో రూ 13 కోట్లు క్రెడిట్ అయినట్టు మెసేజ్‌లు రావడంతో వారు బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. తన బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందనే భయంతో ఓ కస్టమర్ చెన్నై పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
పోలీసులు బ్రాంచ్ అధికారులను సంప్రదించగా సాంకేతిక లోపం కారణంగా డెబిట్, క్రెడిట్ అప్డేట్స్ కలిసిపోవడంతో ఇలా జరిగిందని బ్యాంకు అధికారులు గుర్తించారు. తమ బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమయినట్టు వచ్చిన మెసేజ్ స్క్రీన్షాట్లను పలువురు కస్టమర్ల ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో ఆదివారం రూ 2.49 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్టు మెసేజ్‌లో కనిపించిందని ఓ యూజర్ ట్వీట్ చేశాడు.
ఆదివారం ఉదయం తన భార్య ఖాతాలో రూ 1.23 కోట్ల జమవగా మధ్యాహ్నానికి ఆ మొత్తం కనిపించలేదని మరో యూజర్ పోస్ట్ చేశాడు. వంద ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాలో రూ 13 కోట్లు క్రెడిట్ అయ్యాయని సమాచారం రాగా అన్ని ఖాతాల్లో వేర్వేరు మొత్తాలు క్రెడిట్ అయ్యాయని బ్యాంకు అధికారులు ధ్రువీకరించారు. సాఫ్ట్వేర్ లోపంతోనే ఇలా జరిగిందని ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని బ్యాంకు అధికారి తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా ఖాతాలను తాత్కాలికంగా నిలుపుదల చేశామని చెప్పారు.