ఎల్బీనగర్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో తప్పులు చేయాలంటే దొంగలు భయపడే రోజులు వచ్చాయని, పోలీస్ వ్యవస్థ మరింత మెరుగుపడిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గురువారం నిర్వహించిన సమావేశంలో డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి, నిధుల సమీకరణకు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, ప్రముఖుల ద్వారా కాలనీల భద్రతా నిమిత్తం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీని సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం భద్రతా దృష్ట్యా అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల వ్యవధిలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లను సీసీ కెమెరాలతో రక్షణ కల్పిస్తామన్నారు. తమ ప్రజాప్రతినిధుల నిధుల (ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తన నియోజకవర్గం నిధుల నుంచి రూ.5 కోట్లు, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం నిధుల నుంచి రూ.1 కోటి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త నిధుల నుంచి రూ. 1 కోటి కలిపి) నుంచి మొత్తం రూ.7కోట్లు కేటాయించామని, త్వరలోనే మరో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిధుల నుంచి కూడా రూ.1 కోటిని కేటాయించేందుకు అవకాశం ఉందని, నియోజకవర్గంలోని సామాజిక సేవా సంస్థలు, ప్రముఖుల ద్వారా మరో రూ.3 కోట్లను సమీకరించి సీసీ కెమెరాలకు కేటాయిస్తామన్నారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులతో పాటుగా సామాజిక సేవా సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్త, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, నియోజకవర్గంలోని ప్రముఖులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.