హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు సంబంధించిన కొత్త పాలసీని అమలు చేయకుండా ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను డైలమాలోకి నెట్టింది. ఎంఎస్ఎంఈ-2024 పాలసీ మార్గదర్శకాల ఫైలును సచివాలయం నుంచి తిరుగు టపాలో మళ్లీ పరిశ్రమల శాఖకే చేరింది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన ‘టీఎస్-ఐపాస్’ చట్టంలోని అంశాలనే స్వల్ప మార్పులతో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీలో చేర్చారు. ఇది అమల్లోకి రావాలంటే ప్రభుత్వం తగిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులివ్వాలి. కానీ 8 నెలలు దాటినా కాలేదు.
ఉద్దేశపూర్వక జాప్యమే?
ఎంఎస్ఎంఈ పాలసీని అమలు చేస్తే పరిశ్రమలకు అనుమతులు, సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ పాలసీని జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. నిధుల కొరత వల్ల పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించే పరిస్థితి లేనందునే ఈ విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. రూ.3 లక్షల్లోపు పెట్టుబడితో చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకునేవారికి ‘యువ వికాసం’ పథకం కింద 60 నుంచి 80% వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అలా ఆ పథకాన్ని కొంత కాలంపాటు అమలు చేసి ఎంఎస్ఎంఈ పాలసీని ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించబోతున్నదని, అందుకే మార్గదర్శకాల ఫైలులో పురోగతి లేదన్న ప్రచారం జరుగుతున్నది. కానీ యువ వికాసానికి, ఎంఎస్ఎంఈ పాలసీకి చాలా తేడా ఉన్నది. ప్రభుత్వం ఈ రెండింటికీ ముడిపెట్టి పారిశ్రామిక రాయితీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.
పడకేసిన పరిశ్రమల శాఖ
దేశంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 95 శాతానికిపైగా రూ.10 కోట్లలోపు పెట్టుబడితో కూడిన ఎంఎస్ఎంఈలే. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు టీజీఐఐసీతోపాటు పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. భారీ పరిశ్రమలకు క్యాబినెట్ ద్వారా అనుమతులు మంజూరవుతాయి. కాగా, కొత్త ఎంఎస్ఎంఈ పాలసీకి మార్గదర్శకాలు వచ్చేదాకా ప్రస్తుత పాలసీనే కొనసాగించాల్సి ఉంటుంది. అయినప్పటికీ పాత పాలసీకి అనుగుణంగా అనుమతులు ఇవ్వడాన్ని పరిశ్రమల శాఖ అధికారులు నిలిపివేశారు. ప్రోత్సాహకాల్లో చేసిన మార్పులనే కారణంగా చూపుతున్నారు.
దీంతో పరిశ్రమల శాఖకు పనిలేకుండా పోయింది.