న్యూఢిల్లీ, జూన్ 5: జేఈఈ అడ్వాన్స్డ్ 2026కు అర్హత సాధించి సీబీఎస్ఈ మార్కుల వివాదంలో బాధితులుగా ఉన్న విద్యార్థులకు ఐఐటీ రూర్కీ పెద్ద ఉపశమనం కల్పించింది. 12వ తరగతిలో ఉండాల్సిన 75 శాతం కనీస మార్కులతో సంబంధం లేకుండా సీబీఎస్ఈ విద్యార్థులందరినీ జోసా కౌన్సిలింగ్‌కు అనుమతిస్తామని, అయితే ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సవరించిన స్కోర్ కార్డును ఈ ఏడాది జూలై 15లోగా సమర్పించాలని, అప్పుడే వారికి సీట్ల కేటాయింపు జరుగుతుందని పరీక్షలు నిర్వహించిన ఐఐటీ రూర్కీ శుక్రవారం ఎక్స్‌లో ప్రకటించింది.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)లో జరిగిన అవకతకవల కారణంగా మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడం, ఒకరి మార్కులు ఒకరికి పడటం వంటివి చేటుచేసుకున్నాయి. దీంతో అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినప్పటికీ 12వ తరగతిలో నిర్దేశిత కటాఫ్ 75% (జనరల్, ఓబీసీ-ఎన్సీఎల్, జనరల్-ఈడబ్ల్యూఎస్) లేదా 65%(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ) కన్నా కొందరికి తక్కువ మార్కులు వచ్చాయి.
సీబీఎస్ఈ తప్పిదం కారణంగా 12వ తరగతి సీబీఎస్ఈ విద్యార్థులు ఐఐటీ సీట్‌ను కోల్పోకూడదన్న లక్ష్యంతో వారికి మార్కులతో సంబంధం ఈ వెసులుబాటు కల్పించినట్టు ఐఐటీ రూర్కీ తెలిపింది. ర్యాంకు ఆధారంగా మీకు సీటు కేటాయిస్తారని పేర్కొన్నది. అయితే జూలై 15లోగా స్కోర్ కార్డును సమర్పించాలని, నాలుగో రౌండ్ చివరిలో వారికి ఎక్కడ సీటు వచ్చిందో తెలిపి అడ్మిషన్ కల్పిస్తామని వివరించింది.