జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా పలువురు ఉద్యోగులు, అధికారుల తీరు మాత్రం మారడంలేదు. ఈ నెలలోనే వారం రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టరేట్లో ఈ-సెక్షన్ ఉద్యోగితోపాటు తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. లంచావతారులు వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నప్పటికీ అవినీతిపరులు మాత్రం జంకడంలేదు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా పనులు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
కొందరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అడిగినంత లంచం ఇస్తూ పనులు పూర్తి చేసుకుంటుండగా, లంచం ఇవ్వలేని పేదలు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూ, లంచగొండులను పట్టిస్తున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతోపాటు మీ సేవా నిర్వాహకులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ సేవా నిర్వాహకులు భూ సమస్యలు మొదలుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రేషన్ కార్డు తదితర దరఖాస్తులకు సంబంధించి దేనికి దరఖాస్తు చేసుకున్నా అందినకాడికి దోచుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది.
Ration Card | వికారాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మీ సేవా నిర్వాహకులు ఏ దరఖాస్తుకు ఎంత ఫీజు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయించి, ప్రతి మీ సేవా కేంద్రాల్లో ఫీజుల సమాచారం ప్రదర్శిస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కాకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు బాధితులు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా వారు మాత్రం పట్టించుకోవడంలేదు. మీ సేవా నిర్వాహకుల దోపిడీ పర్వం అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు మీ సేవా కేంద్రాలను పర్యవేక్షించాల్సిన ఈడీఎంకు తెలిసే మీ సేవా నిర్వాహకుల దోపిడీ వ్యవహారం జరుగుతున్నదని ఆరోపణలున్నాయి. కొందరు మీ సేవా నిర్వాహకుల నుంచి ఈడీఎంకు నెలనెలా డబ్బులు అందుతున్నాయనే ప్రచారం కూడా జిల్లాలో జోరుగా జరుగుతున్నది.
Hyd7
మీ సేవా కేంద్రాల వసూళ్ల వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇవేకాకుండా భూ సమస్యల పరిష్కారంతోపాటు రేషన్ కార్డుల జారీ తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులు, ఉద్యోగులతో లింకులు పెట్టుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. పలు మండలాల్లో అధికారులకు మీ సేవా నిర్వాహకులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి అధికారులకు ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తున్నది.
అడిగినంత ఇవ్వాల్సిందే..
జిల్లాలో పేదల అవసరాన్ని ఆసరాగా తీసుకొని అందినకాడికి మీ సేవా నిర్వాహకులు దోచుకుంటున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ విషయంలో మీ సేవా నిర్వాహకులతోపాటు తహసీల్దార్ కార్యాలయాల్లో అప్రూవల్ చేస్తున్న ఉద్యోగులతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలోని పలువురు ఉద్యోగులు రేషన్ కార్డుల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
మరో విషయమేమిటంటే అడిగినంత డబ్బులిస్తే దరఖాస్తు చేసుకోకున్నా నేరుగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో ఆధార్ వివరాలను ఇస్తే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతున్నది. కొత్త రేషన్ కార్డుల జారీలో దరఖాస్తుదారుల నుంచి ఒక్కో కార్డుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వారం రోజుల క్రితం పూడూరు మండల కేంద్రంలోని మీ సేవా నిర్వాహకుడు రూ.3 వేలు ఇస్తే కొత్త కార్డు ఇప్పిస్తామని డిమాండ్ చేయడంతో బాధితులు సదరు మీ సేవా నిర్వాహకుడిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.