High BP | ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద అనారోగ్య సమస్యల్లో రక్తపోటు కూడా ఒకటి. ప్రతి సంవత్సరం మే 17 న ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. ఇది ఒక సైలెంట్ కిల్లర్ గా శరీర మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు కారణంగా మధుమేహం, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు దాదాపుగా ఎటువంటి లక్షణాలను చూపించదు. తరచూ రక్తపోటును పరీక్షించుకోవడమే సరైన మార్గం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం 120/80 ని రక్తపోటు సాధారణ పరిమితిగా పరిగణిస్తారు. 140 /90 మధ్య పరిధిని ప్రీ హైపర్ టెన్షన్ గా భావిస్తారు. అలాగే 140/90 కంటే ఎక్కువ రీడింగ్ ను గమనిస్తే మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అర్థం.
ఉప్పును అధికంగా తీసుకోవడం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోవడం వంటి వాటిని రక్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనం రక్తపోటు బారిన పడకుండా చూసుకోవడమే ఉత్తమమైన పని. రక్తపోటుతో బాధపడే వారు సహజ సిద్దమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అధిక రక్తపోటును తగ్గించే ఆహారాల గురించి వైద్యులు వివరిస్తున్నారు. అధిక రక్తపోటుతో బాధపడే వారు అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండును నేరుగా తీసుకోవడంతో పాటు స్మూతీ, మిల్క్ షేక్ వంటి వాటిని తయారు చేసి కూడా తీసుకోవచ్చు.
పాలకూరను తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో పొటాషియంతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు ఎముకలు ధృడంగా ఉంటాయి. అలాగే రోజుకు నాలుగు సెలెరీ కాడలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో థాలైడ్స్ అని పిలువబడే ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కండరాల కణజాలాన్ని సడలించి రక్తప్రవాహాన్ని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా రక్తపోటును తగ్గించడంలో దోహదపడతాయి. రక్తపోటును అదుపులో ఉంచడంలో ఓట్మీల్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆహారంలో భాగంగా ఓట్మీల్ ను తీసుకోవడం వల్ల సిస్టోలిక్, డయాస్టొలిక్ ఒత్తిడి రెండు కూడా అదుపులో ఉంటాయి. అవకాడోలలో ఒలీక్ ఆమ్లం ఉంటుంది. వీటితో పాటు ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఎ, కె, ఇ, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
పుచ్చకాయను తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇందులో ఎల్- సిట్రుల్లైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. అలాగే పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో దోహదపడతాయి. రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ ను తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. బీట్రూట్ లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే రోజూ ఒక గ్లాస్ నారింజ పండు రసాన్ని తీసుకోవడం వల్ల కూడా రక్తపోటును తగ్గించుకోవచ్చు. దీనిలో విటమిస్ సి తో పాటు ఫైబర్ ఉంటుంది. రక్తపోటుతో బాధపడే వారికి నారింజ పండు అద్భుతంగా పని చేస్తుందని చెప్పవచ్చు.
రక్తపోటును తగ్గించడంలో క్యారెట్ కూడా మనకు దోహదపడుతుంది. క్యారెట్ లో బీటా కెరోటీన్, పొటాషియం అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల గుండె, మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలా సరైన ఆహారాలను తీసుకోవడంతో పాటు ఉప్పును తక్కువగా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, కనీసం రోజుకు 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం, కాఫీని తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ ను, ధూమపానాన్ని మానివేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.