జిన్నారం, మార్చి 16: ఎయిర్‌గన్ మిస్ ఫైర్‌లో నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం జరిగింది. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఆ కుటుంబంలో ఈ ఘటన తీరని దు:ఖాన్ని మిగిల్చింది. ఎస్సై సిద్ధిరాములు కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన నాగరాజు మూడు నెలల క్రితం తన భార్య సుకన్య, కూతురు శాన్వీ(4), కొడుకు ప్రేమ్‌కుమార్(2)తో కలిసి జిన్నారం మండలంలోని వావిలాల శివారులో ప్రసాద్‌కు చెందిన ఫాంహౌస్‌లో పని చేసేందుకు వచ్చాడు. ఫౌంహౌస్లోని పండ్ల తోటలు, చెట్లకు కాపలా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఫాంహౌస్‌లోని ఇంట్లో అప్పటికే ఎయిర్‌గన్ ఉంది. మంగళవారం ఉదయం సమయంలో నాగరాజు భార్య సుకన్య ఇంటిని శుభ్రం చేసింది. ఈ క్రమంలో సామగ్రిని సర్దుతూ గోడకున్న ఎయిర్‌గన్‌ను తీసి కింద పెట్టింది. అక్కడే ఉన్న కూతురు శాన్వీ, కొడుకు ప్రేమ్‌కుమార్ ఎయిర్గన్పై కూర్చుని ఆడుకున్నారు. ఈ క్రమంలో ట్రిగ్గర్ను తాకడంతో గన్ పేలి శాన్వీ తలకు తాకింది. వెంటనే కిందపడిపోయిన శాన్వీ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తండ్రి నాగరాజు మరొకరి సహాయంతో బైక్ మీద గడ్డపోతారంలోని ఒక ప్రాథమిక దవాఖానకు తీసుకెళ్లాడు. తలనుంచి రక్తస్రావం అవుతుండడంతో అక్కడి నుంచి సూరారంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ అడ్మిట్ చేసుకోకపోవడంతో ఉస్మానియా దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తుండగా బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో శాన్వీ మృతి చెందింది. బుధవారం వావిలాలలోని ఫాంహౌస్‌ను పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, జిన్నారం ఎస్సై సిద్ధిరాములు, గుమ్మడిదల ఎస్సై విజయ్‌కృష్ణ పరిశీలించారు. సంగారెడ్డి నుంచి వచ్చిన క్లూస్ టీం ఫింగర్ ప్రింట్లు, ఇతర ఆధారాలు తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.