భద్రాచలం, మార్చి 3: నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా శ్రమిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం టీఆర్ఎస్ భద్రాచలం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. జిల్లాలో సమస్యలను ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలు మన సీఎం అమలు చేస్తున్నారని, వాటి గురించి సరైన రీతిలో ప్రచారం చేయలేకపోతున్నామని, ఇప్పటికైనా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం త్వరలోనే ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తేనే విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. భద్రాచలంలో గత ఎన్నికల్లో 10 వేల ఓట్లతో ఓడిపోయామని, దానికి బదులుగా తదుపరి ఎన్నికల్లో 20 వేల ఓట్లతో గెలిచితీరాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు బడుల అభివృద్ధికి రూ.7,289 కోట్లను కేటాయించిందని, రాష్ట్రంలో 10 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిచేకూర్చిందని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు పథకాలు ఎంతోమందిని ఆదుకుంటున్నాయని అన్నారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా 6, 7, 8 తేదీల్లో ‘మహిళాబంధు కేసీఆర్’ పేరిట సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ముందుగా భద్రాచలం బ్రిడ్జి వద్ద ప్రభుత్వ విప్ రేగాకు టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, టీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, తిప్పన సిద్ధులు, కోటగిరి ప్రబోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.