Collector Koya Sri Harsha | కోల్ సిటీ, జనవరి 29 :పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక ఇన్ఛార్జి కమిషనర్ జే అరుణ శ్రీతో కలిసి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
అనంతరం నగర పాలక కార్యాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు. నగర పాలక పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి రామగుండం, గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ పట్టణాల్లో ఎక్కడికక్కడే నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అరుణ శ్రీ కలెక్టర్ కు వివరించారు. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామనీ, 31న పరిశీలన పూర్తి చేసి సక్రమంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
నామినేషన్ తిరస్కరించిన అభ్యర్థులు ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గం.ల వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందనీ, సదరు అప్పీల్ ను ఫిబ్రవరి 2న పరిష్కరిస్తామనీ, 3న మధ్యాహ్నం 3 గం.ల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందనీ, ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట నగర పాలక అధికారులు ఉన్నారు.