ఎంపీ బండి సంజయ్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. రుక్మాపూర్‌కు సైనిక్ స్కూల్ తెచ్చానని ప్రచారం చేసుకుంటున్నడు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సకల వసతులతో సైనిక్ స్కూల్ నడుస్తున్నది. దానికి ఇప్పుడు పీపీపీ పద్ధతి మంజూరు వచ్చింది. ఈ మాత్రం దానికే సంజయ్ గొప్పలు చెప్పుకుంటున్నడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి కొత్తగా ఏం ప్రతిపాదనలు చేశారు..? ఏం మంజూరు చేయించారో..? ప్రజలకు చెప్పాలి. పేరు కోసం డ్రామాలు, అసత్య ప్రచారాలు చేయడం తప్ప సంజయ్‌కు ఏమీ తెల్వదు. ఫేక్ యూనివర్సిటీకి ఓ వైస్ చాన్స్‌లర్‌గా మారిండు.
కార్పొరేషన్, మార్చి 27: బండి సంజయ్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, కేంద్రం నుంచి కొత్తగా ఏది తీసుకురాకుండానే ఏదో చేశానని ప్రచారం చేసుకుంటున్నాడని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఆదివారం నగరంలోని మంత్రి మీసేవ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రుక్మాపూర్‌లో సైనిక్ స్కూల్ మంజూరు చేయించానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో అప్పటి ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కృషితో రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ నిర్వహణ చేపడుతున్నదని తెలిపారు. ఇప్పుడు కేవలం దానికి కేంద్రం నుంచి పీపీపీ పద్ధతి మంజూరు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మాత్రం దానికే బండి సంజయ్ గొప్పలు చెప్పుకుంటున్నాడని, కొత్తగా స్కూల్ ఏమైనా మంజూరు చేయించారా..? చెప్పాలని ప్రశ్నించారు. గతంలో వినోద్‌కుమార్ ట్రిపుల్ ఐటీ కోసం ప్రయత్నించారని, తీరా పక్క రాష్ర్టాలకు తరలిపోతుంటే సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నూతనంగా కేంద్ర ప్రభుత్వానికి ఏం ప్రతిపాదనలు చేశారు..? ఏం మంజూరు చేయించారో..? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించిందని, దమ్ముంటే అక్కడ స్కూల్ మంజూరు చేయించాలని సవాల్ విసిరారు. రుక్మాపూర్ స్కూల్‌కు ఇప్పటి వరకు ఒక్క పైసా అన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించారా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఎక్కడైనా పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తే సైనిక్ స్కూల్‌కు అనుమతులు ఇస్తామని ఇదివరకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే రుక్మాపూర్‌లో స్కూల్‌కు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, ఇప్పటికే ఓ విద్యార్థి పైలెట్‌గా ఎంపికైనట్లు గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం 150 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే ఒక్కటైనా తీసుకురాగలిగావా..? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను నూకలు తినాలని కేంద్ర మంత్రి అవమానపరిస్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఓట్లు, ప్రజల్లో పేరు కోసం డ్రామాలు, అసత్య ప్రచారాలు చేయడం తప్ప బండి సంజయ్‌కు ఏం తెలియదని, సంజయ్ ఫేక్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా మారారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిదన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, జడ్పీటీసీ రాంమోహన్‌రావు, చొప్పదండి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్, వెంకటరమణారెడ్డి, గంగన్న, వోడ్నాల రాజు, అఫ్రోజ్‌ఖాన్, శ్రీధర్, శ్రీహరి, శ్రీరామ్, సురేందర్, ఇప్పనపల్లి సాంబయ్య, భూంరెడ్డి, దూలం సంపత్, మాచర్ల వినయ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.