ఐస్క్రీంను చేతిలో కాసేపు పట్టుకోగానే కరిగిపోతుంది. అందుకే ఫ్రిజ్‌లోనుంచి తీసిన వెంటనే గబగబా తినేస్తాం. కానీ, చైనాలోని చిసేక్రీం కంపెనీకి చెందిన ఐస్‌క్రీం లైటర్‌తో వేడిచేసినా కరగట్లేదట. 31 డిగ్రీల సెల్సియస్ (88 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత ఉన్న గదిలో ఒక గంటసేపు ఉంచినా పూర్తిగా కరిగిపోవడం లేదు. ఇందులో ఉండే రసాయనాలవల్లే ఇలా జరుగుతోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఐస్క్రీంను వేడిచేస్తున్నట్లు చూపే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సోషల్‌మీడియాలో ఐస్‌క్రీం వీడియో వైరల్ కావడంతో “హీర్మేస్ ఆఫ్ ఐస్ క్రీం” అని పిలిచే చిసేక్రీం బ్రాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐస్‌క్రీం అధిక ధరలపై నెటిజన్లు ప్రశ్నించారు. ఇంత ధరపెట్టి కొంటే తమకు రసాయనాలతోకూడిన ఐస్‌క్రీం ఇస్తారా? అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, తమ ఉత్పత్తులు జాతీయ ఆహార భద్రత నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐస్ క్రీం చిక్కగా చేసేందుకు ఉపయోగించే ఉత్పత్తులు సురక్షితంగా ఉన్నాయని నేషనల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన వాంగ్ సీ పేర్కొన్నారు.