మంచిర్యాల, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కోసం గుర్తించిన భూమిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గర్మిళ్ల శివారు కాలేజీ రోడ్లో భూదాన్ భూములున్న సర్వే నంబ ర్లు 707లో 2.30 ఎకరాలు, 708లో 9.10 ఎకరాలు జైలు కోసం గుర్తిస్తూ ఎంఆర్వో మంచిర్యాల ఆర్డీవో, కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఇదే సర్వే నంబర్ 708లో ఓ పక్కన మాతాశిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) ఉంది. 2022లో వందేళ్ల చరిత్రలోనే ఎప్పు డూ లేనంత భారీ వరదలు రావడంతో మంచిర్యాల పట్టణం సగం మునిగింది. ఈ క్రమంలో ఎంసీహెచ్ సగం మునిగిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి గడిచిన రెండేళ్లుగా వరదల సమయంలో ఎంసీహెచ్‌ను ఖాళీ చేయించి పేషెంట్లను జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. 2018లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే అధికారులు ల్యాండ్ గుర్తించి పనులు మొదలుపెట్టారు. దీనిని స్థానిక బీఆర్ఎస్ నాయకుల ఫెయిల్యూర్‌గా కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారు.
అధికారంలోకి వచ్చాక ఎంసీహెచ్ మునిగిపోతుందనే కారణం చూపించి ఐబీ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కూల్చివేసి మరీ కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఎంసీహెచ్ పక్కనున్న స్థలా న్ని జిల్లా జైలుకు కేటాయించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. మరి ఆసుపత్రి మునిగినప్పుడు అదే స్థలంలో జైలు వస్తే అది కూడా మునగదా.. అది ముగినితే అక్కడ కాదని మరో దగ్గర జైలు కట్టిస్తారా అనే చర్చ నడస్తున్నది. పోనీ జైలు కట్టాక ఆ స్థలంలోకి వరద నీరు రావా.. ఒక వేళ వరదలు వస్తే ఆసుపత్రి నుంచి పేషంట్లను తరలించినట్లు జైలు నుంచి ఖైదీలను తరలిస్తా రా..తరలిస్తే ఎక్కడికి తరలిస్తారు. ఆక్రమం లో ఒకవేళ ఖైదీలు పారిపోతే బాధ్యులు ఎవ రు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మెడికల్ కాలేజీకి.. కలెక్టర్ ఆఫీసుకు పనికిరాని భూమి..
ఇప్పుడు జిల్లా జైలు కోసం ప్రతిపాదిస్తున్న భూమి గోదావరి ఒడ్డుకు కేవలం 500 మీటర్ల దూరంలో వస్తుంది. ఇదే స్థలం గతంలో మెడికల్ కాలేజీ, కలెక్టర్ కార్యాలయ నిర్మాణాల కోసం స్థల పరిశీలన చేశారు. కానీ.. అప్పుడున్న ఆర్అండ్బీ అధికారులు ఈ స్థలం కట్టడాలకు అనుకూలం కాదని చెప్పారు. దీంతో కలెక్టరేట్ నస్పూర్‌కు, మెడికల్ కాలేజీ గుడిపేటకు తరలించారు. ఆ నిర్మాణాలను పని చేయని భూమిని జైలు కేటాయించడం ఏంటన్నది అర్థం కావడం లేదు. పైగా జిల్లా జైలు నిర్మాణానికి 25 ఎకరాలు కావాలని జైళ్ల శాఖ కోరింది. ఇదే సర్వే నెంబర్ 708లో ఇప్పుడు గుర్తించిన 9.10 ఎకరాలు కాకుండా దాని పక్కనే మరో 10 ఎకరాలు ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న 707లోనూ కొంత భూమి ఉంది. అంటే జైళ్ల శాఖ అడిగిన 25 ఎకరాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కేవలం 12 ఎకరాలే ప్రతిపాదించారు. దీనికి గల కారణాలు ఏంటన్నది తెలియరావాల్సి ఉంది.
జైలుకు వేరే దగ్గర స్థలం కేటాయించాలి
కరకట్ట కట్టేది రాళ్లవాగుకు. గోదావరికి కాదు. గతంలో వచ్చినట్లు భారీ వరదలు భవిష్యత్తులో రావా. అప్పట్లో పేషంట్లను తరలించారు. ఇప్పుడు జైలు కడితే ఖైదీలను తరలిస్తారా. నిర్మాణానికి ఏ మాత్రం పనికిరాని ఈ స్థలాన్ని జైలుకు కేటాయించొద్దని మంచిర్యాల ఆర్డీవో నుంచి తెలంగాణ సీఎం వరకు ఫిర్యాదు ఇచ్చాం. మరోచోట అనువైన స్థలాన్ని గుర్తించి జిల్లా జైలు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. అలాగే కబ్జాకు గురైన భూదాన్ భూములను రక్షించేలా స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. – నయీం పాషా, సామాజిక కార్యకర్త