జైపూర్, జూలై 9: రాజస్థాన్‌లోని చురు సమీపంలో బుధవారం ఉదయం భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన ఓ జాగ్వార్ శిక్షణ విమానం కూలిపోయి ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రమాద కారణాన్ని దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆఫ్ ఇంక్వైరీ నియమించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జాగ్వార్ శిక్షణ విమానం నింగిలో ఎగురుతుండగా చురు సమీపంలో కూలిపోయిందని ఓ ప్రకటనలో ఐఏఎఫ్ పేర్కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు పైలట్లు మరణించారు. ఈ ఘటనలో పౌర ఆస్తికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఐఏఎఫ్ తెలిపింది. భనోడా గ్రామంలోని పంట పొలాల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు శిక్షణ విమానం కూలిపోయినట్లు రాజస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం వద్ద మృతదేహాలు కనిపించినట్లు వారు చెప్పారు.
వరుస జాగ్వార్ ప్రమాదాలు..
రాజస్థాన్‌లోని చురు సమీపంలో బుధవారం జరిగిన ఐఏఎఫ్ శిక్షణ విమాన ప్రమాదం ఘటన గడచిన ఐదు నెలల్లో మూడవది. మార్చి 7న హర్యానాలోని అంబాలలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఐఏఎఫ్‌కి చెందిన జాగ్వార్ శిక్షణ విమానం కూలిపోయింది. సాంకేతిక సమస్య కారణంగానే విమానం కూలిపోయినట్లు ఐఏఎఫ్ తర్వాత వెల్లడించగా ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఏప్రిల్ 2న రెండు సీటర్ల మరో జాగ్వార్ శిక్షణ విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో కూలిపోయింది. ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐఏఎఫ్‌కి సంబంధించి ఐదు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మిరాజ్ విమానం గ్వాలియర్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత శివ్‌పురి సమీపంలో కూలిపోయింది. మార్చి 7న అంబాలాలో జాగ్వార్ ప్రమాదం జరిగిన రోజునే తూర్పు సెక్టార్‌లోని బాగ్దోగ్రా ఎయిర్ బేస్ వద్ద ఏఎన్-32 కార్గో విమానం కూలిపోయింది.