లక్నో: అత్యంత భద్రత ఉండే కంటోన్మెంట్‌లోని క్వాటర్స్‌లో నివసిస్తున్న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సివిల్ ఇంజినీర్‌ను ఒక దుండగుడు కాల్చి చంపాడు. (IAF Civil Engineer Shot Dead) ఐఏఎఫ్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కలకలం రేపిన ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాకు 51 ఏళ్ల సత్యేంద్ర నారాయణ్ మిశ్రా, ఐఏఎఫ్‌లో సివిల్ ఇంజినీర్. ప్రయాగ్‌రాజ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఎయిర్‌ఫోర్స్ క్వాటర్స్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
కాగా, శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మిశ్రా నివాసం వద్దకు వచ్చాడు. గార్డెన్ బయట నుంచి పేరుతో ఆయనను పిలిచాడు. బెడ్ రూమ్‌లో ఉన్న మిశ్రా కిటికీ తెరిచి చూశాడు. ఆ దుండగుడు గన్‌తో ఆయనపై కాల్పులు జరిపి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు మిశ్రా గదిలోకి వెళ్లి చూశారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న ఆయనను వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మరోవైపు ఈ విషయం తెలిసి ఎయిర్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగుడ్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే అత్యంత భద్రత ఉండే కంటోన్మెంట్‌లోని క్వాటర్స్‌లో ఐఏఎఫ్ సివిల్ ఇంజినీర్‌పై కాల్పులు జరిపి హత్య చేయడం కలకలం రేపింది.