కోల్‌కతా: మహమ్మారి కరోనా వైరస్ పంజా విసరడంతో ఐ-లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ వాయిదా పడింది. మొదటి రౌండ్ మ్యాచ్‌లు విజయవంతంగా ముగియగా.. గురు, శుక్రవారాల్లో జరుగాల్సిన రెండో రౌండ్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. టోర్నీలో 8 మంది ఆటగాళ్లతో పాటు ముగ్గురు అధికారులకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బుధవారం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నేతృత్వంలోని కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. పరిస్థితులను తెలుసుకుని మ్యాచ్‌ల వాయిదాకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ‘వారం తర్వాత పరిస్థితులను బట్టి మూడో రౌండ్ మ్యాచ్‌లపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఐ-లీగ్ చైర్మన్ సుబ్రత దత్త తెలిపాడు. రియల్ కశ్మీర్ ఎఫ్సీలోని ఐదుగురు ఆటగాళ్లతోపాటు ముగ్గురు అధికారులకు కరోనా సోకగా.. మహ్మదన్ స్పోర్టింగ్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ, ఐజ్వాల్ ఎఫ్‌సీ జట్టులో ఒక్కొక్కరికి పాజిటివ్ తేలింది. ఈ నేపథ్యంలోనే తదుపరి మ్యాచ్‌లు వారం వాయిదా వేశారు.