Pawan Kalyan : తాను క్రమంగా కోలుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో శనివారం ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. పవన్ కల్యాణ్ కొంతకాలంగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. సర్జరీ విజయవంతమైందని, తన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులతోపాటు యావత్ ప్రజానీకానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు నేతల ట్వీట్లకు స్పందిస్తూ.. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. కల్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా కోలుకుంటున్నారని చిరంజీవి చెప్పారు. వైద్యుల సూచన మేరకు సాధారణ కార్యకలాపాల్లోకి తిరిగి రావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చునని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘మీ అందరి ప్రేమకు, ప్రార్థనలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు అన్నయ్య. మీ ప్రేమ, ఆశీస్సులు, నిరంతర సంరక్షణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ మాటలు వెచ్చదనాన్ని, రక్షణను, బలాన్ని ఇస్తాయి. మీ ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని తిరిగి ప్రజాసేవకు వస్తాను’ అని బదులిచ్చారు.
మరో సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మన ప్రియతమ నాయకుడు పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, నూతన శక్తితో తిరిగి వస్తారని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనమందరం ప్రార్థిద్దామని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీనికి పవన్ స్పందిస్తూ.. నా ఆరోగ్యం కోసం మీరు తెలిపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు వైఎస్ జగన్ గారూ.. నేను క్రమంగా కోలుకుంటున్నా అని పేర్కొంటున్నారు. మీ ఆదరణకు కృతజ్ఞుడను అని బదులిచ్చారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పవన్ కల్యాణ్ కోలుకోవాలని తమ సందేశాల్లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అందరి ప్రేమ, ఆప్యాయతలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.