హిసార్, ఏప్రిల్ 15: రైతుల సమస్యలపై తాను పోరాడుతూనే ఉంటానని, ఈ పోరాటంలో తన పదవి పోయినా భయపడేది లేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నేను రైతు పక్షపాతిని. మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ వద్ద నా రాజకీయ శిక్షణ సాగింది. రైతుల కోసం పోరాడాలని, వారి తరఫున గొంతు వినిపించాలని, అవసరమైతే దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చరణ్‌సింగ్ చెప్పేవారు. కాబట్టి నా పోరాటం కొనసాగుతూనే ఉన్నది’ అని తెలిపారు. కాగా కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై సత్యపాల్ తరచుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.