సర్కార్ ఆస్తులు కాపాడాల్సిన హైడ్రా తన అసలు బాధ్యతను మరిచిపోయింది. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా హైడ్రా ఏర్పాటయింది. అయితే హైకోర్టు సైతం ఈ చెరువుల హద్దులు, కూల్చివేతల విషయంలో ఎన్నోసార్లు మందలించినా..పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నదంటూ పలు కేసులు ప్రస్తుతం కోర్టులో హైడ్రాపై నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఔటర్ రింగ్‌రోడ్డు వరకు విస్తరించిన హైడ్రా ఈ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు పరిరక్షించడంలో విఫలమవుతున్నది.
సర్కార్ భూముల్లో ఆక్రమణలు తొలగించి వాటిని పరిరక్షించడమే లక్ష్యమంటూ హైడ్రాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు వేల కోట్ల రూపాయల భూములు పరిరక్షించామంటున్న హైడ్రాకు అసలు ఆ భూముల్లో ఆక్రమణలు తొలగించి కాపాడిన ప్రభుత్వ భూములెన్ని.. అనధికారిక లేఅవుట్లలో పార్కుల పేరుతో కాపాడిన భూములెన్ని.. ఈ లెక్కలలో స్పష్టత ఉందా అంటూ పలువురు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అనధికారిక లేఅవుట్లలో ప్రజోపయోగ భూముల పరిరక్షణను అదనపు బాధ్యతగా భావించి పనిచేయాల్సింది పోయి వీటిలో ఆక్రమణలు తీసేసి ఫెన్సింగ్ వేయడమే ప్రధానంగా హైడ్రా పనిచేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ సర్వే నంబర్ 613లోని 373.22 ఎకరాల ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో ఉంది. ఈ భూమిని కాపాడాలంటూ రైతులు హైడ్రాను ఆశ్రయించారు. కానీ హైడ్రా ఆ భూమి విషయంలో తన చర్యలు ప్రకటించలేదు సరికదా అటువైపు చూడనేలేదు. మేడ్చల్ జిల్లాలో మరోచోట 55 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అనీ, దీనిని కాపాడాలంటూ ఎన్నిసార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా.. వాటిని పట్టించుకోలేదని స్థానికులు చెప్పారు. అసలు హైడ్రా వద్ద నిషేధిత భూముల జాబితా ఉందా అనే ప్రశ్న తలెత్తుతున్నది. వాస్తవానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 25వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. డేటాబేస్‌లో ఈ లెక్కలు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో భారీ ఆక్రమణలు జరిగాయి. వీటిలో సుమారు 3వేల ఎకరాలకు పైగా భూముల్లో ఆక్రమణలు ఉన్నాయంటూ గతంలోనే హైడ్రాకు అధికారుల నుంచి నివేదికలు అందాయి.
వాటన్నింటి విషయంలో తనకు ఏవో ఆధారాలు కావాలంటూ అటకెక్కించారని, అసలు ప్రభుత్వ గెజిట్ ముఖ్య ఆధారం కాగా గెజిట్‌ను హైడ్రా పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఎన్ఆర్ఎస్సీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి నివేదికలే ఆధారంగా పనిచేస్తామని హైడ్రా అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని అటకెక్కించి తన వరకు వచ్చిన భూములపైనే దృష్టిపెట్టింది. గతంలో హైకోర్టు స్పష్టంగా హైడ్రాను మీ దగ్గర నిషేధిత భూముల జాబితా ఉందా అంటూ అడిగినప్పుడు ఏమీ చెప్పలేకపోయారు. ఆ తర్వాతనైనా నిషేధిత భూముల జాబితా తెప్పించుకుని తమ వద్దకు ప్రభుత్వ భూముల ఆక్రమణలంటూ ఏ ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించే అవకాశమున్నా.. వాటి విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారు.
అనధికారిక లేఔట్లలో ఫెన్సింగ్ వేసి..!
ముఖ్యంగా హైడ్రా విషయంలో పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలంటే బుద్దభవన్‌కు పోయి ఫిర్యాదు చేస్తే చాలు..అనే ముద్ర పడిందని హైడ్రా సిబ్బందే చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో లేఔట్లలో పార్కుల ఫెన్సింగ్ కావాలంటే ఆయా కాలనీల వాసులు స్థానిక మున్సిపాలిటీలకు వెళ్లడం మానేశారు. నేరుగా బుద్ధభవన్‌కు సోమవారం వచ్చి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే చాలు.. క్షణాల్లో అధికారులు అక్కడ వాలుతారు. ఆ పార్కును కబ్జా చేసిన ఒకట్రెండు ఆక్రమణలు తొలగిస్తారు. ఆతర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసి కోట్ల రూపాయల విలువైన భూములు కాపాడుతున్నామంటూ ప్రకటించుకుంటున్నారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు అనుసరించి కాలనీల ప్రజలు అడిగిన పార్కులు ఇతర ప్రజావసరాలకు వినియోగించిన స్థలాలు కాపాడడంలో హైడ్రా బిజీగా ఉంటోంది. అనధికార లేఔట్లలోనూ హైడ్రా ఈ పార్కులను కాపాడే పనిలో పడింది అంతేకాకుండా వాటికి ఫెన్సింగ్ వేసి తాము భూమిని పరిరక్షించామంటూ బోర్డులు పెట్టుకుంటుంది. ఇదంతా స్థానిక సంస్థలు చేయాల్సిన పని. లేఔట్లలో ప్రజాప్రయోజనాల కోసం నిర్దేశించిన భూమి అంటే పార్కులు, రోడ్లు ఇతర అవసరాలకోసం కేటాయించిన భూమిని కబ్జాల నుంచి కాపాడి వాటికి ఫెన్సింగ్ వేసే బాధ్యత స్థానిక సంస్థలది. కానీ ఈ పని హైడ్రా తన ఖాతాలో వేసుకుని వేల కోట్ల రూపాయల భూములు కాపాడామంటూ ప్రకటనలు చేసుకుంటూ హడావిడి చేస్తోంది.
ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
అనధికార లేఅవుట్లకు వెళ్తూ వేల కోట్ల రూపాయల భూములు కాపాడామంటూ.. ప్రకటనలు చేసుకుంటుందే తప్ప..ప్రభుత్వ భూములు పరిరక్షించడంలో హైడ్రా విఫలమైంది. అసలు ఎన్ని వేల ఎకరాలు ఆక్రమణ దారుల చేతుల్లో ఉన్నాయో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి హైడ్రాది. నాదర్గుల్లో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ రైతులు హైడ్రాను ఆశ్రయించినా.. ఆ విషయంలో స్పందనేలేదు సరికదా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ డేటాబేస్‌లో మొత్తం ఎన్ని వేల ఎకరాల సర్కారు భూములున్నాయి? వాటిలో ఎంత మిగిలింది, ఎంత కబ్జాకు గురైందనే విషయాలను బయటకు తీసుకురాకుండా తమకు నచ్చిన, పైనుంచి వచ్చిన ఆదేశాలతో పాటు ప్రజావాణి ఫిర్యాదులపై స్పందించడం తప్ప.. అసలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భూముల కబ్జాలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి.