హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 : రియల్ ఎస్టేట్ బూమ్ తరహాలో ప్రస్తుతం స్టార్టప్ బూమ్ నడుస్తోంది. ఒకవైపు ప్రభుత్వాలు, మరోవైపు కార్పొరేట్ కంపెనీలు స్టార్టప్‌లను అడుగడుగునా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఈ వాతావరణం కొత్తగా మరిన్ని స్టార్టప్‌ల ఏర్పాటుకూ ఊతమిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో హైదరాబాద్ నగరం టాప్ 5 స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. బెంగళూరు, ఢిల్లీ తర్వాత భాగ్యనగరమే. ముంబై, అహ్మదాబాద్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల్లోకి రూ.6,697 కోట్ల (900 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. ఫండింగ్ రూపంలో పలు కంపెనీలు, పెట్టుబడిదారులు ఈ ఇన్వెస్ట్మెంట్లు పెట్టారని టీ-హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. ఇక జినోమ్, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్‌లు కలిసి గతేడాదికిగాను గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్టు (జీఎస్‌ఈఆర్-2021)ను విడుదల చేయగా, అందులో ఆసియా స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్‌లో తెలంగాణకు 30వ స్థానం వచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో హైదరాబాద్ స్థానం నానాటికీ మెరుగుపడుతూనే ఉందని స్టార్టప్ నిపుణులు అంటున్నారు.
అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం టీ-హబ్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత క్రమంగా దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఫలితంగా స్టార్టప్‌లకు స్వర్గధామంగా తెలంగాణ మారింది. టెక్నాలజీ స్టార్టప్‌లే కాకుండా విభిన్న రంగాలు, సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ స్టార్టప్‌లను ప్రోత్సహించే అనుకూల వాతావరణం ఇప్పుడు తెలంగాణ సొంతం. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇలా అన్నిచోట్ల సరికొత్త ఆలోచనలతో వచ్చేవారికి అండగా నిలిచేలా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశారు. టీ-హబ్‌తో మరిన్ని సత్ఫలితాలు సాధ్యమయ్యాయి.
ఇన్నోవేషన్ పాలసీ..
2016 నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించి అమలు చేస్తోంది. కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో, మెడికల్, అగ్రికల్చర్, సామాజిక రంగాల్లో స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 20కిపైగా ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో శరవేగంగా స్టార్టప్ ఎకోసిస్టమ్ మెరుగుపడటానికి ఇక్కడి నైపుణ్యం, ప్రతిభ కలిగిన మానవ వనరులూ కలిసొచ్చాయి. స్టార్టప్‌లకు ఫండింగ్ చేసేందుకు ఎంతోమంది పెట్టుబడిదారులు అమితాసక్తి చూపుతున్నారు. ఐటీ రంగంలో ఎంతో ప్రగతి సాధించినట్టే స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధిలోనూ తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నది.
టీ-హబ్ ప్రత్యేకతలు..
సమస్య ఏదైనా పరిష్కారం చూపే సత్తా స్టార్టప్‌లకు ఉందని రుజువవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన పలు స్టార్టప్ కంపెనీలు దేశంలోనేగాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందాయి. తద్వారా యునికార్న్లుగా అవతరించాయి. రాష్ట్రంలో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉండటంతో దేశ, విదేశాలకు చెందినవారు సైతం ఇక్కడ స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌ల కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేయడంతో పరిస్థితుల్లో చాలామార్పు వచ్చింది. – రమేశ్ లోకనాథన్, గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్ అధిపతి