హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో రీజినర్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం డీపీఆర్ ఇంకా పూర్తికాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఉత్తర భాగం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఎంపీ కే లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఉత్తర భాగానికి సంబంధించి 161.518 కి.మీ పొడవు, 6 లేన్లుగా డీపీఆర్ సిద్ధమైందని స్పష్టంచేశారు.
ఈ ప్రాజెక్టు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో రూ.23, 935.6 కోట్ల అంచనా వ్యయంతో అమలుచేసేందుకు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలించిందని పేర్కొన్నారు. 99.06 శాతం భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. 87.19 శాతం భూసేకరణకు అవార్డు ప్రకటించినట్టు తెలిపారు. ప్రాజెక్టు అమలు కాలపరిమితిని డీపీఆర్, ఫీజిబులిటీ అధ్యయనం, సంబంధిత అధికారుల ఆమోదం అనంతరం ఖరారు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నాలుగు జాతీయ రోడ్డు ప్రాజెక్టులు పీపీపీ విధానంలో చేపట్టినట్టు గడ్కరీ తెలిపారు. రూ.10, 772.24 కోట్ల అంచనా వ్యయంతో 270.77 కి.మీ రహదారి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు.