‘హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రభుత్వ సానుకూల దృక్పథం, ప్రత్యేక అనుకూలతల వల్లే ప్రగతి సాధ్యమవుతున్నది, ఎస్ఆర్డీపీ సీఎం కేసీఆర్ మానసపుత్రిక. ఈ కార్యక్రమం కింద వందలాది కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించుకున్నం. ఇప్పటికే 24 చోట్ల పనులు అందుబాటులోకి రాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నయి. సీఆర్ఎంపీతో 719 కి.మీ. మేర రహదారులను చూడచక్కగా తయారు చేసినం. వందకోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డుపై ఎల్ఈడీ లైట్లు బిగించి చీకట్లు లేకుండా చేసినం. రసూల్‌పురా వద్ద రహదారి విస్తరణకు అవసరమైన స్థలం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. ప్యాట్నీ నుంచి కొంపల్లి, జూబ్లీ బస్టాండ్ నుంచి తుర్కపల్లి వరకు స్కైవేలు నిర్మించాలని నిర్ణయించాం. ఈ మార్గంలో కేంద్ర రక్షణ శాఖ భూములు ఉండడంతో నిర్మాణాలు సాధ్యం కావడం లేదు. వీటిని అప్పగించాలని ఇప్పటివరకు నలుగురు కేంద్ర రక్షణ మంత్రులకు వివరించాం. అయినా స్పందన లేదు. రద్దీగా ఉండే కంటోన్మెంట్ ప్రాంతంలో 21 రోడ్లను మూసివేశారు. వీటిని తెరిపించేందుకు చొరవ చూపండి’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రూ.333 కోట్లతో షేక్‌పేటలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను శనివారం కేంద్రమంత్రితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. -కొండాపూర్
సిటీబ్యూరో/కొండాపూర్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి వెన్నెముక అయిన ఐటీ కారిడార్‌కు బడారాస్తా తెరుచుకుంది. కించిత్తు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రయ్…మంటూ ఐటీ కారిడార్లోకి వాహనదారులు ప్రశాంతంగా వెళ్లేందుకు నగరంలోనే రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. శనివారం రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, అరికెపూడి గాంధీ, ముఠా గోపాల్, గ్రేటర్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం కింద రూ.333.35 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం మానస పుత్రిక అయిన వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం (ఎస్.ఆర్.డి.పి.) ద్వారా చేపట్టిన పనుల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, ఆర్ఓబీలు, తదితర 24 నిర్మాణాలు ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇందుకోసం రూ.6వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఏడేండ్ల వ్యవధిలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు.
ఎస్.ఆర్.డి. పి., సీఆర్ఎంపీ పథకాలతో పాటుగా హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ ద్వారా కూడా 132 లింకు-మిస్సింగ్ రోడ్లను చేపడుతున్నామన్నారు. సీఆర్ఎంపీ ద్వారా ఐదేళ్లలో 709 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు సుమారు 500 కిలోమీటర్లను అభివృద్ధి చేశామన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో మిగిలిన రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇటీవలే అవుటర్ రింగు రోడ్డు మొత్తం ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రసూల్పురలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేస్తున్న స్థల సేకరణలో ఎదురువుతున్న ఇబ్బందులకు కేంద్ర హోం శాఖ పరిష్కారం చూపాలని.. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రికి లిఖిత పూర్వకంగా రాసిచ్చామని.. మరోసారి లేఖ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని 21 రోడ్లను రక్షణ శాఖ మూసి వేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
నగరాన్ని కలుపుతున్న 8 జాతీయ రహదారుల విస్తరణతో పాలు పలు మార్గాల్లో స్కైవేలు సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉప్పల్-వరంగల్ జాతీయ మార్గంలో స్కైవేను నిర్మిస్తున్నామని.. ప్యాట్నీ నుంచి కొంపల్లి.. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి తుర్కపల్లి వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఆరు సంవత్సరాల్లో నలుగురు కేంద్ర మంత్రులను కలిసినట్లు తెలిపారు. కానీ ఇంతవరకు పరిష్కారం లభించలేదన్నారు. కేంద్ర రక్షణ శాఖ భూముల అప్పగింతకు నిరాకరిస్తుందని.. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపి భూములు ఇప్పిస్తే ఈ స్కైవేల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు..
ఇస్తాంబుల్‌కు ఉన్నంత చారిత్రక గుర్తింపు తెలంగాణకు ఉందని.. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. హెరిటేజ్ సిటీగా నగరం వారసత్వ సంపద కాపాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యూనిసెఫ్ ద్వారా గుర్తింపు తేవాలని కోరారు. సైన్స్ సిటీ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి ఇస్తామని, సంబంధిత మంత్రికి చెప్పి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. రాష్ర్టాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సమష్టి కృషి చేసి, భవిష్యత్తు తరాలకు మంచి హైదరాబాద్‌ను అందించే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో 70 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ రాష్ర్టానికి రాని రోడ్లు ఇప్పుడు వచ్చాయన్నారు. మంజూరైన జాతీయ రహదారుల పనులను త్వరలో కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటుకు 25 ఎకరాల భూసేకరణ చేయాలని ఇటీవలనే సీఎం కేసీఆర్‌కు లేఖ రాశామని, ఎంత త్వరితగతిన భూసేకరణ పూర్తి చేస్తే అంత తొందరగా ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. రీజనల్ రింగు రోడ్డు భూసేకరణను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఏడు టూమ్స్ అభివృద్ధికి స్వదేశీ దర్శన్ పథకం కింద నిధులు మంజూరు చేశామన్నారు.
కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు ఇప్పించండి..
రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హయాంలో నగరాభివృద్ధిపై ముందుచూపు ప్రదర్శించలేదని, సీఎం కేసీఆర్ నగరాభివృద్ధిని ఒక విజన్‌తో ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి కేంద్రం నుంచి రూ.పదివేల కోట్ల నిధులను ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, ఇంజినీర్-ఇన్-చీఫ్ శ్రీధర్, సీఈ దేవానంద్, ఎస్ఈ వెంకటరమణ, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
షేక్‌పేట-రాయిదుర్గం ైప్లె ఓవర్ ప్రత్యేకతలు
పొడవు : 2.72 కిలోమీటర్లు
వెడల్పు: రెండు వైపులా రాకపోకల కోసం 6 లేన్లతో రహదారి
వ్యయం:రూ.333.55కోట్లు
4 కూడళ్లను (షేక్‌పేట నాలా-సెవన్ టూంబ్స్, ఓయూ కాలనీ, విష్పర్ వ్యాలీ-నార్నే-జేఆర్సీ కన్వెన్షన్, జూబ్లీహిల్స్-ఫిలింనగర్ కూడళ్లు) దాటుతూ నగరంలో నిర్మించిన రెండో అతి పెద్ద ఫ్లై ఓవర్.
సిటీని అభివృద్ధి చేసుకుందాం..
ఎన్నికలు వచ్చినపుడే రాజకీయాలు. ఆ తర్వాత ఎవరి పని వారిదే. భావితరాల బాగు కోసం సమష్టిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం. దీనికి కేంద్ర సహకారం చాలా అవసరం. ఇక్కడి వారసత్వ, చారిత్రక సంపద ఇస్తాంబుల్‌తో పోటీపడుతున్నది. చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్రమంత్రి కృషి చేయాలి. రీజినల్ రింగ్‌రోడ్డు, సైన్స్ సిటీ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తాం.